సరిహద్దులో సైన్యానికి సవాలు విసిరేందుకు.. శీతాకాలం వచ్చేస్తోంది. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్యే.. పాంగాంగ్, తూర్పు లద్దాఖ్ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు -20 డిగ్రీలకు పడిపోనున్నాయి. దేశ రక్షణలో భాగంగా గస్తీ కాస్తున్న దాదాపు 1,00,000మంది భారత్-చైనా సైనికులకు ఇది కష్టకాలమే. ఎందుకంటే రానున్న కొన్ని నెలల పాటు నియంత్రణ రేఖ వద్ద.. కనికరం చూపని ప్రకృతే సైనికులకు ప్రధాన శత్రువుకానుంది.
అయితే భారత సైనికులు ఈ అంశంలో పైచేయి సాధించే అవకాశముంది. ఎందుకంటే సైన్యానికి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో శత్రుమూకలతో పోరాడిన అనుభవం ఉందని చరిత్ర చెబుతోంది.
జోరావర్ సింగ్ శీతాకాల పోరాటం
చరిత్రను పరిశీలిస్తే.. 1841లో దిగ్గజ డోగ్రా నాయకుడు జనరల్ జోరావర్ సింగ్.. పాంగాంగ్ సరస్సులో శీతాకాలంలో సైనిక శిబిరం ఏర్పాటు చేశారు. టిబెట్‌ను స్వాధీనం చేసుకోవటమే లక్ష్యంగా.. బలగాలకు గడ్డకట్టిన సరస్సుపై శిక్షణనిచ్చారు.
ప్రస్తుతం ఆ సరస్సు ఒడ్డుపైనే భారత్-చైనాలు ఘర్షణలకు దిగుతున్నాయి. భారీ ఎత్తున బలగాలను మోహరించాయి. ఉత్తర ప్రాంతంలోని శిఖరాలపై చైనా తిష్టవేయగా.. దక్షిణ ప్రాంతంపై భారత్ పట్టు సాధించింది.
అయితే నాడు అన్ని రకాల జాగ్రత్తలతో.. శిక్షణతో జోరావర్ సైన్యం బరిలోకి దిగినా.. ప్రకోపించిన ప్రకృతి ముందు అనేక అవస్థలు పడింది. ముఖ్యంగా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో తూర్పు లద్దాఖ్, టిబెట్ శీతాకాలం వారికి అనేక సమస్యలు సృష్టించింది.
ఈ సైన్యం 1834లో లద్దాఖ్‌ను జయించిన తర్వాత.. మరింత ఆత్మవిశ్వాసం ప్రొది చేసుకుని స్కర్దూ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అదే ఇప్పటి గిల్గిత్-బాల్టిస్థాన్. ఇక 1839-40 కాలంలో జోరావర్ తన దృష్టి పూర్తిగా టిబెట్పైనే సారించారు. అక్కడి శాలువాల వ్యాపారం ఆయనను బాగా ఆకట్టుకుంది.
జోరావర్ సింగ్ అతిక్రమణల గురించి భారత చరిత్రకారులు చాలా విషయాలు చెప్పారు. అయితే, టిబెట్ కథనాలు మరింత ఆసక్తి కలిగిస్తాయి.
టిబెట్ తత్వవేత్త, మాజీ ఆర్థిక శాఖా మంత్రి షకబ్పా సెపాన్.. అధ్యయనం మేరకు జోరావర్ సైన్యం ఎక్కువగా సిక్కులు, లద్దాఖీలతో ఉండేది. ఈ సైన్యంతో టిబెట్ యుద్ధం.. పశ్చిమ టిబెట్‌లోని ఘారీ కోర్సమ్ ప్రాంతంలో జరిగింది. నాడు జోరావర్ సింగ్ సేనలు తక్లఖర్ వరకూ వచ్చాయి. ఇప్పుడిదే భారత్-చైనా-నేపాల్ ట్రైజంక్షన్‌గా ఉన్న తక్లకోట్ ప్రాంతం.