తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల నాటికి టీఎంసీలో దీదీ ఒక్కరే: షా - అమిత్​ షా

బంగాల్​ శాసనసభ ఎన్నికల నాటికి అధికార తృణమూల్​ కాంగ్రెస్​లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కరే మిగులుతారని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ఇది ఆరంభం మాత్రమేనని.. చేరికలపై పరోక్షంగా వెల్లడించారు. మిద్నాపోర్​ బహిరంగ సభలో దీదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

BJP leader Amit Shah
కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

By

Published : Dec 19, 2020, 3:57 PM IST

బంగాల్​ పర్యటనలో భాగంగా అధికార తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. పార్టీ సీనియర్​ నేతలు టీఎంసీని వీడుతున్నారని, ఎన్నికల నాటికి మమతా బెనర్జీ ఒక్కరే ఆ పార్టీలో మిగులుతారని జోస్యం చెప్పారు.

మిద్నాపోర్​లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో టీఎంసీ నేతల చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు షా. ప్రలోభాలతో తమ పార్టీ నేతలను చేర్చుకుంటున్నారని భాజపాపై దీదీ ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్​ నుంచి బయటకు వచ్చి టీఎంసీ పార్టీని ఏర్పాటు చేయటం ఫిరాయింపు కాదా? అని ప్రశ్నించారు. ఇది ప్రారంభం మాత్రమేనని.. ఎన్నికల నాటికి బంగాల్​ రాజకీయ చిత్రం మారిపోతుందన్నారు.

"విధాన సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే.. 200కుపైగా సీట్లతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. సీనియర్ నేతలు టీఎంసీని వీడుతున్నారు. మీరు మూడు దశాబ్దాలు కాంగ్రెస్​కు, 27 సంవత్సరాలు కమ్యూనిస్టులకు, 10 ఏళ్లు మమతా దీదీకి అవకాశం ఇచ్చారు. ఐదేళ్లు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. బంగాల్​ను స్వర్ణ ప్యాలెస్​లా తీర్చిదిద్దుతాం."

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు షా. తన అల్లుడిని తదుపరి ముఖ్యమంత్రి చేసే పనిలో దీదీ బిజీగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో హింసకు ఎంతగా పాల్పడితే.. అదే స్థాయిలో భాజపా బలంగా ఉద్భవిస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బంగాల్​ లైవ్​: షా సమక్షంలో భాజపాలోకి భారీగా చేరికలు

ABOUT THE AUTHOR

...view details