వయసు చిన్నదే.. కానీ, మనసంతా దేశం కోసం పనిచేయాలనే ఆరాటం. అందుకే ఊరు కాని ఊరొచ్చి, పొరుగు రాష్ట్రంలో అన్ని పరీక్షలు దాటుకొని తన కలను సాకారం చేసుకున్నాడు. దేశ సరిహద్దుల్లో గస్తీ కాస్తూ, శత్రుమూకలను తరిమికొడుతూ భరతమాత రుణం కొంతైనా తీర్చుకుంటున్నాడు. అప్పుడే విధికి కన్నుకుట్టింది. ఉగ్రదాడి రూపంలో ముంచుకొంచి ఆ యువ సైనికుడి ప్రాణాలు బలిగొంది. ఈ క్రమంలో అతడు మరణానికి కొద్ది గంటల ముందు తన స్నేహితుడితో మాట్లాడిన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దేశ రక్షణలో నిత్యం ప్రాణాలకు తెగించి పోరాడే తమకు ఏదో ఒక రోజు మరణం తప్పదు కదా.. అని ఆ జవాన్ అన్న మాటలు హృదయాల్ని కలచివేస్తున్నాయి.
దేశ్‌ముఖ్ యశ్ ప్రొఫైల్ మహారాష్ట్ర టూ కశ్మీర్ వయా: కర్ణాటక
మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లా చాలిగావ్ తాలూకాకు చెందిన యశ్ దేశ్‌ముఖ్ సైన్యంలో చేరాలనే ఇష్టంతో 2019లో కర్ణాటకలో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు హాజరయ్యాడు. అక్కడే ఆర్మీకి ఎంపికై, ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లోని 101 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 26న(గురువారం) శ్రీనగర్‌లోని పారింపొరాలో జరిగిన దాడిలో సిపాయ్ రతన్ సింగ్‌తో సహా యశ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతడి మరణంతో స్వగ్రామంలో రోదనలు మిన్నంటాయి.
అయితే.. ఈ ఘటనకు ఒక రోజు ముందు యశ్.. తన స్నేహితుడితో వాట్సాప్ ద్వారా మాట్లాడాడు. ఎలా ఉన్నావ్ మిత్రమా? అని ఆ స్నేహితుడు యశ్‌ను అడగ్గా.. 'నేను బాగానే ఉన్నాను. మా జీవితం గురించి ఏం చెబుతాం! ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఏదో ఒకరోజు పోతాం!' అంటూ సమాధానమిచ్చాడు. సైనికుడి జీవితం దినదిన గండంగానే ఉంటుందని తన మిత్రుడితో చెప్పాడు యశ్. అవే తన ఆఖరిమాటలవుతాయని యశ్ కూడా ఊహించి ఉండడేమో. ఆ మరుసటి రోజే ఉగ్రదాడి రూపంలో మృత్యుఒడికి చేరుకున్నాడా సైనికుడు. మరణానికి కొద్ది గంటల ముందు యశ్ చేసిన ఆ వాట్సాప్ చాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి:యూపీ 'లవ్ జిహాద్' ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం