తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: 'రాష్ట్ర హోదా'పై రాజకీయ రగడ - #delhi dangal

దిల్లీ.. కేంద్రపాలిత ప్రాంతం. దీనిని పాలించేందుకు లెఫ్టినెంట్​ గవర్నర్​(ఎల్జీ)తో పాటు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రీ ఉంటారు. అయితే.. కొద్దికాలంగా ఇరువురి నడుమ విభేదాలు తలెత్తాయి. ఎల్జీ తమ అధికారాల్ని తక్కువ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు సీఎం కేజ్రీవాల్​. ఏ పని చేయాలన్నా కేంద్రం అనుమతి తప్పనిసరి అంటున్న కేజ్రీ.. దిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కావాలంటూ ఎప్పటినుంచో ఉద్యమిస్తున్నారు. తాజాగా దిల్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చారు. అసలు దిల్లీకి రాష్ట్ర హోదా సాధ్యమేనా.. ఆ సంగతేంటి.. ఓ సారి చూద్దాం.

what-is-your-official-stand-on-granting-full-statehood-to-delhi-aap-asks-bjp
దిల్లీ దంగల్​: 'రాష్ట్ర హోదా'పై రాజకీయ రగడ

By

Published : Feb 5, 2020, 7:02 AM IST

Updated : Feb 29, 2020, 5:42 AM IST

దిల్లీ దంగల్​: 'రాష్ట్ర హోదా'పై రాజకీయ రగడ

''70 ఏళ్ల నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, అసోం, బంగాల్​.. ఇలా దేశంలోని ప్రతి రాష్ట్రానికి పూర్తి హోదా ఉంది. పూర్తి రాష్ట్రం అంటే.. ప్రజలు తమ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రి ఉంటారు. ఆ ప్రభుత్వం చేతుల్లోనే పూర్తి అధికారం ఉంటుంది. ప్రజల కోసం పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు కట్టాలంటే పూర్తి అధికారం వారి చేతుల్లోనే ఉంటుంది.

కానీ.. దిల్లీ మాత్రం 70 ఏళ్లుగా పూర్తి రాష్ట్రం కాదు. సగం రాష్ట్రం మాత్రమే. దిల్లీ ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ.. ఆ సర్కారు చేతుల్లో అధికారం​ ఉండదు. దేనికైనా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే. పాఠశాల కట్టాలన్నా, కళాశాల నిర్మించాలన్నా కేంద్రం దగ్గరికెళ్లాలి. మేం ఏం పని చేయాలనుకున్నా.. కేంద్రం అనుమతి తప్పనిసరి. ఈ కారణంగా.. 70 ఏళ్లుగా దిల్లీ ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంది. దిల్లీకి ఇప్పుడు సమయమొచ్చింది. దిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రంగా మారాల్సిందే.''

- 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేజ్రీవాల్​

"దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా".. ఇది ఎప్పటినుంచో వినిపిస్తోన్న డిమాండ్​. దేశ రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్​ ఆద్మీ పార్టీ.. ఎప్పటినుంచో కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. ఇప్పుడు దిల్లీ శాసనసభ ఎన్నికల వేళ ఆ డిమాండ్​ను మరోసారి తెరపైకి తెచ్చింది. తన ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ 'దిల్లీకి రాష్ట్ర హోదా'ను చేర్చింది ఆమ్​ ఆద్మీ పార్టీ.

అసలు దిల్లీకి రాష్ట్ర హోదా ఎందుకు..? ఆప్​ ఎందుకంత పట్టుబడుతుంది..? కేంద్రం ఎందుకు వెనక్కు తగ్గుతుంది..? దేశ రాజధానికి రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందేనా..?

1956 నవంబరు 1న దేశ రాజధాని దిల్లీ... కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటైంది. 1991లో దిల్లీకి ఒక అసెంబ్లీ, ముఖ్యమంత్రి వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. ఈ తరహా విధానం దిల్లీ, పుదుచ్చేరి.. తాజాగా జమ్ముకశ్మీర్​కు మాత్రమే ఉంది. కాబట్టి దిల్లీ పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతమనిగానీ, పూర్తి రాష్ట్రమని కానీ అనడం కుదరదు.

మా చేతుల్లో ఏం లేదు..!

కేంద్రపాలిత ప్రాంతమే కాక దిల్లీ... దేశ రాజధాని కూడా. భూమి, పాలన, కార్యనిర్వాహక యంత్రాంగం, పోలీసులపై అధికారాలన్నీ కేంద్రం చేతుల్లోనే ఉంటాయి. మునిసిపల్​, చిన్నాచితకా వ్యవహారాలు మాత్రమే స్థానిక ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి.

అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న దిల్లీలో పెత్తనం.. ఎక్కువగా కేంద్రం చేతిలో, అంటే స్థానికంగా లెఫ్టినెంట్​ గవర్నర్​(ఎల్జీ)కు ఉంటుంది. ఇదే అక్కడ గొడవ. ప్రతి దాంట్లోనూ స్థానిక ఆప్​ ప్రభుత్వానికి, కేంద్రానికి వాగ్వివాదాలు. కొంతకాలంగా అధికారాల విషయంలో దిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టూ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

సుప్రీం చెప్పినా ఫలితం మాత్రం..!

సుప్రీం ధర్మాసనం 'దిల్లీ అధికారాల'పై కాస్త స్పష్టతనిచ్చినా ఏం మారలేదు. అవినీతి నిరోధక శాఖ, విచారణ కమిషన్‌ ఏర్పాటు అంశాలపై ఎల్జీకి నియంత్రణ ఉంటుందని తెలిపింది సుప్రీం. విద్యుత్‌ బోర్డు, ఎలక్ట్రిసిటీ కమిషన్‌పై మాత్రం దిల్లీ ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని తీర్పు వెలువరించింది.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని గతంలో సుప్రీం.. దిల్లీ అధికారాల అంశమై పేర్కొన్నప్పటికీ అది ఏ మాత్రం ఆచరణలో ఉందో చెప్పడం కష్టం. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు.. ఎల్జీకి నివేదించాలనీ స్పష్టం చేసింది. ఇదెలా ఉందో చెప్పడమూ కష్టమే.

భాజపా మదిలో ఏముందో..?

దిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా లేదా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇదే విషయమై దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్​ తివారీ.. సీఎంగా కేజ్రీవాల్​ ఉన్నంతకాలం పూర్తి స్థాయి రాష్ట్ర హోదా దక్కదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు గతంలో ఆరోపించారు ఆప్​ నేత గోపాల్​ రాయ్​. అంతకుముందు ఈ హామీ నెరవేర్చని కాంగ్రెస్​ను ప్రజలు తిరస్కరించారని.. భాజపాకు ఇదే గతి పడుతుందని అన్నారాయన.

కాంగ్రెస్​ వైఖరి ఏంటి..?

అయితే.. దిల్లీ రాష్ట్ర హోదాపై కాంగ్రెస్​ వైఖరి వేరేలా ఉంది. ఇదే విషయమై గతంలో స్పష్టతనిచ్చారు ఆ పార్టీ సీనియర్​ నేత అజయ్​ మాకెన్​. దిల్లీకి గనుక రాష్ట్ర స్థాయి హోదా ఇస్తే.. దేశ రాజధాని సంక్షోభంలో చిక్కుకుంటుందని, శాంతి భద్రతలు క్షీణిస్తాయని పేర్కొన్నారు.

దిల్లీ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తుందన్న ఆయన.. రాష్ట్రంగా మారితే అక్కడి ప్రజలు పన్ను భారాన్ని తట్టుకోలేరన్నారు. ఇతర మెట్రో నగరాల కంటే దిల్లీలో పెట్రోల్​, డీజిల్​ ధరలు.. సహా ఎన్నో వస్తువులు చౌక ధరకే లభిస్తాయని, దానికి కారణం ఆ భారాల్ని కేంద్రం భరించడమేనని అప్పట్లో వివరించారు మాకెన్.

మహిళా భద్రత, ఉపాధి...

అయితే.. దిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా వస్తేనే మహిళలకు అర్ధరాత్రి ధైర్యంగా రోడ్లపై తిరిగే స్వాతంత్ర్యం వస్తుందని ఉద్ఘాటిస్తున్నారు ఆప్​ అధినేత కేజ్రీవాల్​. ఉద్యోగాలు, కళాశాలల్లో స్థానికులకు 85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనీ హామీ ఇచ్చారు. రాష్ట్ర హోదాతో మహిళా భద్రత, యువతకు ఉపాధి ఇలా ఎన్నో సాధ్యమవుతాయని.. విద్యారంగం మెరుగుపర్చడం సహా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చని విశ్లేషిస్తున్నారు ఆప్​ నేతలు.

ఇదే వాదన పునరుద్ఘాటిస్తూ దిల్లీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రాష్ట్ర హోదా అంశాన్ని చేర్చింది ఆప్​. దీని కోసం ఎంతదూరమైనా వెళ్తామని భాజపాకు గట్టి హెచ్చరికలు పంపిస్తున్నారు ఆ పార్టీ నాయకులు.

దిల్లీకి అవసరమా..?

ఆర్థిక అసమతుల్యత, ఆర్థికంగా బలహీనం, పాలనా, రాజకీయం పరంగా అస్థిరంగా ఉన్నాయన్న కారణంతో కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో అవి తప్పనిసరిగా కేంద్రంపై ఆధారపడాల్సి వచ్చింది. అందుకే.. ఈ కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వమే పాలిస్తుందని చెప్పగలం. అయితే.. దిల్లీ లాంటి అభివృద్ధి చెందిన ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వకపోవడం సమంజసమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదే వాదనను ఆప్​ నొక్కి చెబుతోంది.

ఇవీ చూడండి:

దిల్లీ దంగల్​: సోషల్​ మీడియానే రణక్షేత్రం

దిల్లీ దంగల్​: పార్టీల 'పేరడీ పోరాటం'- ఓటర్లకు వినోదం

దిల్లీ దంగల్​: బరిలో రాజకీయ 'బంధు'గణం

Last Updated : Feb 29, 2020, 5:42 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details