కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతూ.. యావత్ ప్రపంచాన్ని చుట్టేసింది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టే విషయంలో కాంటాక్ట్ ట్రేసింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే.. అసలు ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఏంటి? అది ఏవిధంగా పని చేస్తుంది అనేది తెలుసుకుందాం.
కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ భౌతిక దూరం పాటిస్తున్నారు. కారణం వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా ఉండడం కోసం. ఇదే విధంగా ఒక వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధరణ అయిన తరువాత అతని కుటుంబ సభ్యులను, సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి ఐసోలేషన్‌కు తరలిస్తారు. ఇలా చేయడాన్నే కాంటాక్ట్ ట్రేసింగ్ అంటారు. ఈ విధంగా చేయడం వల్ల వైరస్‌ను కట్టడి చేయొచ్చు.
కొవిడ్ బాధితుల్ని కలిసిన వారిని అప్రమత్తం చేయడం కాంటాక్ట్ ట్రేసింగ్ లక్ష్యం. తద్వారా ఇతరులకు వ్యాపించకుండా నిరోధించవచ్చు. కరోనా మహమ్మారిని కట్టడి చేయటం, ఆర్థిక కార్యకలాపాలను సురక్షితంగా తిరిగి ప్రారంభించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ ఇది అంత సులభమైన విషయం కాదని అభిప్రాయపడుతున్నారు.