తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాలుష్య పోరు'లో ప్రపంచం నుంచి భారత్​ ఏం నేర్చుకోవాలి? - తాజా వార్తలు వాయుకాలుష్యం

ఉత్తర భారతాన్ని కాలుష్య భూతం కమ్మేసింది. స్వచ్ఛమైన గాలి కరవై ప్రజలు అల్లాడిపోతున్నారు. సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసినా, ప్రభుత్వాలు చొరవ చూపినా.. కాలుష్యంపై యుద్ధంలో ఏం చేయలేని పరిస్థితి. ప్రపంచానికే పెను సమస్యగా మారిన వాయు కాలుష్యాన్ని ఇతర దేశాలు ఎలా ఎదుర్కొంటున్నాయి? వాటి నుంచి భారత్​ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి?

'కాలుష్య పోరు'లో ప్రపంచం నుంచి భారత్​ నేర్చుకోవాల్సింది?

By

Published : Nov 17, 2019, 9:00 PM IST

Updated : Nov 18, 2019, 12:11 PM IST

పంట వ్యర్థాల దగ్ధం... బాణసంచా మోత.. వాహనాల పొగతో దేశ రాజధాని సహా ఉత్తర భారతం... కాలుష్య కేంద్రంగా మారింది. వాయు కాలుష్య స్థాయి నానాటికీ పెరిగి ప్రమాదకర స్థితికి చేరుతోంది. ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ సమస్యలతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారమేంటి? వివిధ దేశాలు కాలుష్యంపై తీసుకుంటున్న చర్యలేంటి? అవి మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి?

వాయు కాలుష్యం బారి నుంచి బయట పడేందుకు ఆయా దేశాలు రకరకాల మార్గాల్ని అన్వేషిస్తున్నాయి. నీటిని వెదజల్లే డ్రోన్లు, ఆరుబయట వాయు శుద్ధి యంత్రాల్ని ఏర్పాటు చేయడం ద్వారా గాలి నాణ్యతను పెంచడం వరకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చైనా విధానాలు ప్రత్యేకం...

వాయు కాలుష్యంపై పోరాడేందుకు చైనా అనుసరిస్తోన్న విధానాలు మంచి ఫలితాల్నే ఇచ్చాయి. సాంకేతికత, పక్కా వ్యూహాలతో ఉద్గారాల నియంత్రణ, బొగ్గు కాల్చడం ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించింది డ్రాగన్​ దేశం.

వాట్​ ఏన్​ ఐడియా...

అడవుల నరికివేత ద్వారా కాలుష్యం మరింత పెరిగిపోతుందని గ్రహించిన.. డ్రాగన్​ దేశం తూర్పు చైనా నాంజింగ్​లో నిలువెత్తు అడవుల్ని (వెర్టికల్ ఫారెస్ట్​) ఏర్పాటు చేస్తుంది. ఇవి ఏడాదికి 25 టన్నుల కార్బన్​డై ఆక్సైడ్​ను పీల్చుకొని... రోజుకు 60 కేజీల ఆక్సిజన్​ను విడుదల చేస్తున్నాయి.

నిలువెత్తు అడవి (వెర్టికల్​ ఫారెస్ట్​)

స్మాగ్​​ టవర్​...

కాలుష్య నియంత్రణ కోసం చైనా కనుగొన్న మరో విధానం స్మాగ్​ టవర్​ (పొగమంచు టవర్​). 100 మీటర్ల ఎత్తుండే ఈ టవర్​ వినియోగం కారణంగా గాలి నాణ్యతలో అభివృద్ధి కనిపించింది.

స్మాగ్​ టవర్​ (పొగమంచు టవర్​)

వేగంగా సత్ఫలితాలు...

ప్రపంచంలోని ముఖ్య కాలుష్య నగరాలకు చైనా పుట్టినిల్లు. అయితే కొన్నేళ్లుగా చైనా ప్రభుత్వం అవలంబిస్తోన్న విధానాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. గాలి నాణ్యతలో బీజింగ్​ నగరం కొన్నేళ్లుగా గణనీయమైన అభివృద్ధి సాధించింది.

అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో...ఓ పెద్ద నగరం.. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ, మరోవైపు ఆర్థిక అభివృద్ధిలో సమతుల్యత ఎలా పాటించాలో తెలుసుకోవడానికి బీజింగ్​ ఓ చక్కటి ఉదాహరణగా నిలిచింది.

ప్రేరణగా...

కాలుష్య నియంత్రణ కోసం చైనా తీసుకుంటున్న సంస్కరణలను ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలించాయి. పర్యావరణవేత్తలు డ్రాగన్​ ప్రభుత్వ చర్యలను స్వాగతించారు. బీజింగ్​ ఒలింపిక్స్​కు ముందు కాలుష్య కారకాలైన పలు పరిశ్రమలను మూసివేస్తూ ధైర్యంగా నిర్ణయం తీసుకుంది చైనా ప్రభుత్వం. దీర్ఘకాలంగా ఫలితాలిచ్చే సంస్కరణలపై వేగంగా అడుగులు వేస్తోంది చైనా.

తక్షణ ఫలితాలకై పారిస్...

కాలుష్యాన్ని నియంత్రించేందుకు పారిస్​ కొన్ని నిర్ణయాలు తీసుకొంది. ముఖ్యమైన నగరాల్లో వారాంతంలో కార్లను నిషేధించింది. దిల్లీలో విధించిన సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టింది. కాలుష్యం పెరిగిపోతున్న సమయాల్లో.. ప్రజా రవాణాను ఉచితం చేసింది. కార్​-బైక్​ షేరింగ్​ వంటి కార్యక్రమాలను చేపట్టింది. ఆమ్​స్టర్​డామ్​ నగరంలో 2030 నుంచి పెట్రోల్​, డీజిల్​ కార్లు, మోటారు వాహనాలపై పూర్తి నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇండోనేషియా...

ఇండోనేషియాలోని జాంబి నగరం.. ఐరాస పర్యావరణ సూత్రాల ప్రకారం..ఉద్గారాల నియంత్రణకు చర్యలు చేపట్టింది. చెత్త నుంచి మీథేన్​ సేకరణ, చెత్త కాల్చివేతపై నిషేధం వంటివి తీసుకువచ్చింది. మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టింది.

అమెరికా ఓహియో విశ్వవిద్యాలయం ఆచార్యులు భావిక్​ భక్షి... భారత్​లో కాలుష్యంపై స్పందించారు. సాంకేతికతను వినియోగించి వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని భారత్​ నియంత్రించాలని సూచించారు. కాలుష్యాన్ని నియంత్రించాలంటే కచ్చితమైన సంస్కరణలు, చర్యలు ప్రభుత్వం చేపట్టాలని.. అందుకు ప్రజలూ బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, ప్రజలు కలిస్తేనే ఈ కాలుష్య భూతాన్ని నియంత్రించగలమన్నారు.



Last Updated : Nov 18, 2019, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details