అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో 1976-77, 2003లో రెండుసార్లు తవ్వకాలు చేపట్టారు. రెండోసారి జరిగిన తవ్వకాల నివేదికను తన తీర్పునకు ఆధారంగా చేసుకుంది సుప్రీంకోర్టు. అలహాబాద్ హైకోర్టు లఖ్నవూ ధర్మాసనం ఆదేశంతో 2003, మార్చి 12 నుంచి 2003 ఆగస్టు 7వరకు బి.ఆర్.మణి నేతృత్వంలోని బృందం వివాదాస్పద ప్రాంతంలో జీపీఆర్(భూగర్భంలోకి చొచ్చుకెళ్లే రాడార్) విధానంలో తవ్వకాలు చేపట్టింది. అదే ఏడాది జూన్‌లో 574 పేజీల నివేదికను సమర్పించింది.
- ఈ తవ్వకాల్లో క్రీస్తుపూర్వం12వ శతాబ్దానికి చెందిన పురాతన రాళ్లు, శిల్పాలు, నిర్మాణ వస్తువుల ఆనవాళ్లు లభించాయి.
- మసీదు గోడల కింద... దాని నిర్మాణంకంటే ముందే అస్తిత్వంలో ఉన్న ఓ పెద్ద కట్టడానికి చెందిన పునాదులు ఉత్తర, దక్షిణ మార్గాల్లో సమాంతరంగా ఉన్నాయి.
- ఒక గోడమీద మరోగోడ నిర్మించినట్లు ఉంది. అంటే తొలి కట్టడాన్ని కూల్చేసి మరోటి నిర్మించినట్లు ఇది స్పష్టంచేస్తోంది.
- కట్టడం మధ్యలో 15×15 మీటర్ల పరిమాణంలో ఒక ఎత్తయిన గద్దె(ప్లాట్‌ఫాం) కనిపించింది.
ఆయా వస్తువుల కాలాన్ని నిర్ధారించడానికి కార్బన్‌డేటింగ్ చేయగా వివిధ పురాతన కాలాలకు చెందిన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అత్యంత లోతైన పొరలో తొలి నగరీకరణ ప్రారంభమైన క్రీ.పూ.1000 నుంచి 300 కాలం నాటి ఇనుప నాగరికతకు చెందిన మహిళా దేవతల ప్రతిమలు, పూసలు, కాల్చిన మట్టి(టెర్రకోట), సీసం ఉన్నాయి. తర్వాతి పైపొరలో క్రీ.పూ.200 చెందిన శుంగుల కాలానికి చెందిన మహిళలు, జంతువులకు చెందిన టెర్రకోట ప్రతిమలు, నలుపు, బూడిద రంగు వంటపాత్రలు, కాల్చిన ఇటుకలు, రాళ్ల వరుసలు కనిపించాయి.