కరోనా.. కరోనా.. కరోనా.. ప్రపంచమంతా ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ. ఈ వైరస్ ప్రభావంతో జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారినా లక్షద్వీప్‌లో మాత్రం సాధారణ జనజీవనానికి ఎలాంటి ఆటంకమూ కలగలేదు. అక్కడ మాస్క్‌ల్లేవు.. శానిటైజర్ల వాడకం ఊసేలేదు. కొవిడ్ నిబంధనల్లేవు.. పెళ్లిళ్లు, పండుగలు, బహిరంగ సభలకు ఎలాంటి ఆంక్షలూ అమలు చేయలేదు. ప్రపంచమంతా కొవిడ్ నిబంధనలతో ఉక్కిరిబిక్కిరైనా అక్కడ మాత్రం జనజీవనం సాఫీగానే సాగుతోంది. లక్షద్వీప్ ‘జీరో కరోనా’ ప్రాంతంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎలాంటి కంటైన్‌మెంట్ వ్యూహాలను అమలుచేశారనే అంశాలను అక్కడి లోక్‌సభ సభ్యుడు పీపీ మహ్మద్ ఫైజల్ వివరించారు.
ఎవరికైనా నిబంధనలు ఒక్కటే!
'దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించినప్పటి నుంచి డిసెంబర్ 8 వరకు ఎవరూ కరోనా బారిన పడలేదు. సున్నా కేసులు ఉన్నాయి. మా అధికార యంత్రాంగం తీసుకున్న ముందు జాగ్రత్తలతో ఇది సాధ్యమైంది. 36చదరపు కి.మీల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపానికి ఎవరైనా రావాలనుకున్నా కఠిన నిబంధనలు అమలు చేశాం. సామాన్యుడైనా, అధికారైనా, ప్రజాప్రతినిధి అయినా ఇంకెవరైనా కేంద్ర పాలిత ప్రాంతంలోకి ప్రవేశించాలంటే.. ఈ నియమాలను కచ్చితంగా పాటించాల్సిందే. లక్షద్వీప్‌కు ఓడల్లోనైనా, హెలికాప్టర్లలోనైనా వెళ్లేందుకు ఏకైక కేంద్రంగా ఉన్న కొచ్చిలో ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే'
కొనసాగుతున్న తరగతులు
'దీవుల్లో ఉన్న ప్రజలకు మాత్రం ఎలాంటి నిబంధనలూ అమలు చేయలేదు. అది గ్రీన్ ఏరియా కావడం వల్ల మాస్క్‌లు, శానిటైజర్ల వాడకం కూడా లేదు. లక్షద్వీప్‌లో పాఠశాలలు తెరిచే ఉన్నాయి. అక్కడ తరగతులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పాఠశాలలు తెరిచేందుకు అనుమతించిన నేపథ్యంలో సాధారణంగానే అన్ని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాలు.. అన్ని మామూలుగానే జరుగుతున్నాయి. లక్షద్వీప్‌లో అంతా సాధారణంగానే ఉంది' అని ఎంపీ తెలిపారు.
దేశంలో తొలి కేసుతో అప్రమత్తం
'మన దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదు కావడం వల్ల స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కఠిన చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ, దేశీయ పర్యాటకుల రాకను నిలిపివేసింది. లక్షద్వీప్‌లోని ఒక దీవి నుంచి మరో దీవికి కూడా రాకపోకలు నిలిపివేశారు. కేరళలోని కొచ్చి నుంచి లక్షద్వీప్ రాజధాని నగరమైన కవరత్తికి మాత్రమే అనుమతించేవారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న తమ ప్రజలు, లక్షద్వీప్‌లో ఉద్యోగాలు చేసేవారు, లక్షద్వీప్‌కు వైద్య అవసరాల నిమిత్తం వచ్చేవారి కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. అయితే, లక్షద్వీప్‌కు రావాలనుకునేవారు మాత్రం కోచిలో సంస్థాగత క్వారంటైన్‌లో ఏడు రోజులు ఉండాల్సిందే. ఆ ఖర్చంతా ప్రభుత్వమే భరించేలా ఏర్పాట్లు చేశారు'