ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేయాలని పార్లమెంటును కోరుతూ ఈ ఏడాది జనవరి 27న రాష్ట్ర శాసన సభ సాధికార తీర్మానం ఆమోదించింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి- ప్రస్తుత ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్.టి. రామారావు చూపిన బాటలో నడవటం చిత్రమైన పరిణామం. అన్నట్టు 1985లో ఎన్టీఆర్ శాసన మండలిని రద్దు చేయగా, జగన్ తండ్రి అయిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2007లో దాన్ని పునరుద్ధరించారు. మండలి ప్రస్థానంలో అది మరొక చిత్రమైన మలుపు. మండలి రద్దు తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర శాసన మండలి వల్ల ఖర్చు తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదనీ, అదొక తెల్ల ఏనుగులా తయారైందని వ్యాఖ్యానించారు. 2020 ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ- అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి బిల్లునూ, 2020 ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏపీసీఆర్డీఏ) రద్దు బిల్లునూ అడ్డుకోవడం ద్వారా శాసన మండలి రాష్ట్ర సమతుల అభివృద్ధికి అవరోధంగా మారుతోందని ఆయన విరుచుకుపడ్డారు.
తెలంగాణ విడివడిన తరవాత ఆంధ్రప్రదేశ్‌కు సకల హంగులతో కూడిన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పించారు. ఈ బృహత్తర ప్రాజెక్టును ఏపీసీఆర్డీఏ రద్దు బిల్లు కృష్ణలో కలిపేసింది. జగన్ ప్రభుత్వం తెచ్చిన మొదటి బిల్లు అమరావతిని శాసన రాజధానిగా అట్టిపెట్టి, విశాఖపట్టణాన్ని పాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేయాలని తలపెట్టింది. దీన్ని అభివృద్ధి వికేంద్రీకరణగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వర్ణిస్తోంది. పై రెండు బిల్లులను శాసన సభ ఆమోదించి శాసన మండలికి పంపగా, మండలి వాటిని సెలక్ట్ కమిటీ పరిశీలనకు అందించింది.
అప్పుడు ఎన్.టీ.ఆర్.. ఇప్పుడు జగన్
ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, అనేక ఇతర రాష్టాల్లో కూడా శాసన మండళ్ల పరిస్థితి ఎన్నడూ తిన్నగా లేదు. 1956లో ఆంధ్రప్రదేశ్ శాసన సభ తీర్మానాన్ని అనుసరించి 1958లో శాసన మండలి ఏర్పడింది. 1985లో దాన్ని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు రద్దు చేశారు. శాసన మండలి వల్ల ఖజానాకు అనవసర భారమే తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదని ఆయన అన్నారు. ప్రజలు మండలి సభ్యులను నేరుగా ఎన్నుకోరనీ, ఆ సభ్యులు ప్రజలకు నిజమైన ప్రతినిధులు కారని ఎన్టీఆర్ పేర్కొన్నారు. శాసన మండలి రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా ఉపయోగపడటమే కాదు, ప్రజోపయోగకరమైన కీలక బిల్లులకు మోకాలడ్డుతోందని కూడా ఆయన అప్పట్లో విమర్శించారు. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ సరిగ్గా అలాంటి వాదనలనే తెరపైకి తెచ్చారు. ఎన్టీఆర్ రద్దు చేసిన శాసన మండలిని జగన్ తండ్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2007లో పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.
శాసన ప్రక్రియకు ఆటంకము
శాసన మండళ్ల వ్యవహారం ‘ఒలకబోయడం మళ్లీ ఎత్తిపోసుకోవడం’ చందంగా తయారవడానికి మూల కారణం- అసలు రాజ్యాంగంలో శాసన మండలికి సంబంధించి పటిష్ఠమైన ఏర్పాటు లేకపోవడమే. పార్లమెంటులో దిగువ సభ (లోక్ సభ), ఎగువ సభ (రాజ్య సభ) ఉంటాయని స్పష్టంగా పేర్కొన్న రాజ్యాంగం, రాష్ట్రాలకు శాసన మండళ్లు ఉండి తీరాలని ఎక్కడా నిర్దేశించలేదు. ఏదైనా రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు లేదా రద్దుకు పార్లమెంటు చట్టం ‘చేయవచ్చు’నని 169వ రాజ్యాంగ అధికరణలోని 1వ క్లాజు పేర్కొంటోంది. ‘చేయవచ్చు’ అనడంలో ఉద్దేశం- చట్టం చేయాలో వద్దో తేల్చుకునే అధికారం పార్లమెంటుకు ఉందని! శాసనమండలి సృష్టి లేదా రద్దుకు పార్లమెంటు చట్టం చేయనూవచ్చు, చేయకపోనూవచ్చన్నమాట. అంతా పార్లమెంటు ఇష్టానికే రాజ్యాంగం వదిలేసింది. పార్లమెంటు ఇలాంటి చట్టం చేయాలంటే, మొదట రాష్ట్ర శాసన సభ ప్రత్యేక మెజారిటీతో శాసన మండలి రద్దుకు తీర్మానించాలి.
శాసన సభ మొత్తం సంఖ్యాబలంలో అత్యధికులు రద్దు తీర్మానాన్ని ఆమోదించాలి. అంతేకాక, ఓటింగ్‌లో పాల్గొన్నవారిలోనూ మూడింట రెండువంతులమంది ఆమోదముద్ర వేయాలి. మండలి రద్దు, సృష్టి అనేవి సంబంధిత రాష్ట్ర ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ మేరకు రాష్ట్రం పంపే తీర్మానానికి పార్లమెంటు ఆమోదం తెలపవచ్చు, తెలపకపోవచ్చు. అంతా ఐచ్ఛికమే. రెండు సభలు ఉన్న రాష్ట్రాల పేర్లను 168వ రాజ్యాంగ అధికరణ ఉటంకిస్తోంది కనుక, మండలి రద్దు లేక సృష్టి జరిగినప్పుడల్లా సదరు అధికరణను చీటికిమాటికి సవరించాల్సి వస్తుంది. ఏదైనా రాష్ట్రంలో శాసనమండలి రద్దయితే 168వ అధికరణ నుంచి ఆ రాష్ట్రం పేరును తీసేయాలి. ఒకవేళ మరో రాష్ట్రం కొత్తగా శాసన మండలిని ఏర్పాటు చేసుకుంటే, దాని పేరు చేర్చడానికి 168వ అధికరణను మళ్లీ సవరించాల్సి వస్తుంది. ఈ మార్పుచేర్పులు చేయడానికి 368వ అధికరణలో ఉల్లేఖించిన ప్రక్రియను పాటించనక్కర్లేదని 169వ అధికరణలోని మూడవ క్లాజు పేర్కొంటోంది.