- రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020
- రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020
- అత్యవసర వస్తువుల సవరణ బిల్లు-2020
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులు ఇవే. వీటిని ప్రతిపక్షాలతో పాటు అధికార ఎన్డీఏలోని మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రైతులపై ప్రభావితం చూపే ఈ బిల్లుల్లో ఏముందో తెలుసుకుందాం.
1. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020
రైతులకు తమ ఉత్పత్తులను ప్రభుత్వామోదిత ఏపీఎంసీ మార్కెట్ వెలుపల విక్రయించుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. రైతులకు సులభమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ మార్గాలను కల్పించడం దీని ఉద్దేశం. ఈ చట్టం ప్రకారం రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడం వల్ల వారి నుంచి ఎలాంటి సెస్‌ను గానీ పన్నులనూ వసూలు చేయరు.
ఉపయోగాలు ఇవీ..
- మార్కెటింగ్ ఖర్చులు తగ్గుతాయి.
- రైతులు ఇష్టమైన మార్కెట్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
- మంచి ధరలను రైతులు పొందవచ్చు.
- మిగులు ఉత్పత్తి ఉన్న ప్రాంతాల రైతులు కొరత ఉన్న ప్రాంతాల్లో సరఫరా చేసి మెరుగైన ధరలు పొందవచ్చు.
ప్రతిపక్షాలు ఏం చెబుతున్నాయి..
రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వామోదిత మార్కెట్లో విక్రయించకపోవడం వల్ల రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతాయి. మార్కెట్లో అమ్మకాలు లేకపోవడం వల్ల కమిషన్ ఏజెంట్లు నష్టపోతారు. కనీస మద్దతు ధర ఆధారిత సేకరణ వ్యవస్థ ముగింపునకు.. ఈ చట్టం దారి తీస్తుంది. ప్రైవేట్ సంస్థల దోపిడీకి అవకాశం పెరుగుతుంది.
ప్రధాని ఏమన్నారంటే..
"నూతన బిల్లులు రైతులకు రక్షణ కవచంగా పనిచేస్తాయి. మధ్యవర్తుల వైపు నిలబడేందుకే కొందరు వీటిని వ్యతిరేకిస్తున్నారు. మూడు చారిత్రాత్మక శాసనాలు ప్రవేశపెట్టడం వల్ల రైతులకు వ్యవసాయంలో కొత్త స్వాతంత్ర్యం లభించింది. ఈ బిల్లులు తెచ్చినా వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడం మానదు. కనీస మద్దతు ధర ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
2.రైతుల సాధికారత, రక్షణ, వ్యవసాయ సేవల బిల్లు- 2020
రైతులు నేరుగా అగ్రికల్చర్ బిజినెస్ సంస్థలు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులు, పెద్ద రిటైలర్లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.
ఉపయోగాలు ఇవీ..
- రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిచవచ్చు.
- ఈ విధానాన్ని అనుసరించడం వల్ల మార్కెటింగ్ ఖర్చు తగ్గుతుంది.
- రైతుల ఆదాయం పెరుగుతుంది.
ప్రతిపక్షాల వాదన ఇదీ..
వ్యవసాయ రంగంలో ఆధిపత్యం చెలాయించే బడా సంస్థలకు అనుకూలంగా ఈ చట్టం రూపొందించబడింది. రైతుల శక్తిని బలహీన పరుస్తుంది. ప్రైవేటు సంస్థలు, ఎగుమతిదారులు, టోకు వ్యాపారులకు ఇది లాభం చేకూరుస్తుంది.