శక్తిస్వరూపిణి అయిన దేవతామూర్తిగా స్త్రీని ఆలయాల్లో ప్రతిష్ఠించి అనునిత్యం పూజలు చేసి కైమోడ్పులు అర్పించే సంస్కృతి మనది. నిజజీవితంలో తరాల తరబడి నరనరాల్లో జీర్ణించుకుపోయిన పురుషాధిక్య భావజాలం దేశవ్యాప్తంగా ఆడవారిని అబలలుగా జమకట్టి వారి ప్రగతి కాంక్షలకు నిర్దయగా గోరీ కట్టేస్తోంది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వెలువరించిన తాజా నివేదిక ఆ చేదు నిజాలకే అద్దం పట్టింది.
నానాటికీ దిగజారుతున్న వైనం..
స్త్రీ పురుష సమానత్వంపై ప్రపంచ ఆర్థిక వేదిక తొలిసారి 2006లో నివేదిక సమర్పించినప్పుడు సంబంధిత సూచీల్లో ఇండియా 98వ స్థానంలో నిలిచింది. దరిమిలా ‘నానాటికి తీసికట్టు నాగంభొట్టు’ చందంగా పరిస్థితి దిగజారుతోంది. నిరుడు 108వ స్థానంలో ఉన్న భారత్ నేడు మరో నాలుగు స్థానాలు కోల్పోయి మొత్తం 153 దేశాల జాబితాలో 112వ స్థానంలో నిలిచిందని విశ్లేషణలు చాటుతున్నాయి. మహిళల ఆరోగ్య భద్రత, ఆర్థిక భాగస్వామ్యం- అత్యంత కీలకమైన ఈ రెండు అంశాల్లో ఇండియా అట్టడుగున అయిదు స్థానాల్లో కునారిల్లుతోంది. ఆదాయపరంగా 144, చట్టసభలకు ప్రాతినిధ్యంలో 122, విద్యార్హతలు పొందడంలో 112 స్థానాలకు పరిమితమైన భారత మహిళాలోకం ఇప్పటికీ ఎంతగా సామాజిక ఆంక్షల పరిమితుల చట్రంలో ఒదిగిపోతున్నదో నివేదిక చాటుతోంది. ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్ స్త్రీ సాధికారత పరంగా 50వ స్థానంలో ఉంటే, అగ్రరాజ్యమైన అమెరికా రెండు అంచెలు దిగజారి ఈసారి 53వ స్థానానికి పరిమితం కావడం విశేషం. ప్రబలార్థిక శక్తిగా ఎదిగిన జపాన్ నేటికీ సంప్రదాయ శృంఖలాల్లో స్త్రీలను బంధించి 119వ స్థానంలో కొట్టుమిట్టాడుతుండటం గమనార్హం. స్త్రీ సమానత్వ సూచీలో ఎదుగూబొదుగూ లేకుండా 48 దేశాలు కొనసాగుతున్న సమకాలీన ప్రపంచంలో- ప్రస్తుత తరం తమ జీవితకాలంలో లింగభేదాల్లేని సమాజాన్ని చూడలేదని, ఆ సమున్నతాదర్శం సాకారం కావడానికి దాదాపు వందేళ్లు పడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక చెబుతోంది. ఆరోగ్య సేవల్ని అందరికీ అందించడంలో గుణాత్మక ప్రగతి కనిపిస్తున్నా రాజకీయ, ఉద్యోగ విపణుల్లో మహిళల భాగస్వామ్యాన్ని ఇతోధికం చెయ్యడంలో సరైన అడుగులు పడటంలేదన్న హెచ్చరిక ఇండియాలో పరిస్థితులకూ వర్తిస్తుంది!
లింగ సమానత్వం?
ఐక్యరాజ్య సమితి 2030నాటికి సాధించదలచిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో అయిదో అంశంగా లింగసమానత్వం కొలువుతీరింది. మహిళల హక్కులంటే మానవ హక్కులేనన్న 1995నాటి బీజింగ్ ప్రకటన స్ఫూర్తిని నేటికీ పూర్తిగా ప్రపంచ దేశాలు ఒంట పట్టించుకోలేకపోవడంతో అసమానతల అగాధంలో ‘ఆకాశంలో సగం’ కూరుకుపోతోంది. ఆరోగ్యం, విద్య, ఆర్థికం, రాజకీయం- కీలకమైన ఈ ప్రాతిపదికల ఆధారంగా లింగపరమైన అసమానతల్ని దేశాలవారీగా వేలెత్తిచూపిన ప్రపంచ ఆర్థిక వేదిక, స్త్రీ పురుష సమానత్వ సాధనకు దక్షిణాసియాకు దాదాపు 72 ఏళ్లు పడుతుందని లెక్కగట్టింది. ప్రపంచవ్యాప్తంగా 35,127 పార్లమెంటరీ సీట్లలో 25 శాతం, మంత్రిపదవులు మొత్తం 3,343లో 21 శాతం మహిళలున్నా, స్త్రీ సాధికారత కోసం ఇండియా వంటి దేశాలు చేయాల్సింది మరెంతో ఉందన్న సత్యం కళ్లకు కడుతూనే ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పుణ్యమా అని పునాది స్థాయి రాజకీయాధికారంలో స్త్రీల వాటా కంటికి నదరేగాని, చట్టసభల్లో మూడోవంతు కోటాకు అన్ని పక్షాలూ మొహం చాటేస్తున్న వైనం దేశీయంగా దుర్విచక్షణకు తిరుగులేని దృష్టాంతం. దశాబ్దకాలంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి ఆరు శాతం దాకా పెరిగినా, శ్రామిక శక్తిలో మహిళల వాటా 34 నుంచి 27 శాతానికి పడిపోయింది. స్త్రీ పురుషుల జీతనాతాల్లో వ్యత్యాసమూ 50 శాతంగా నమోదవుతోంది. ఆడపిల్లను ‘మైనస్’గా పరిగణించే దౌర్భాగ్యం లింగనిష్పత్తిని ప్రభావితం చేస్తుంటే, తమ భవిష్యత్తుకు తామే బ్రహ్మలుగా దూసుకొస్తున్న అమ్మలకు సామాజికంగా ఎదురవుతున్న పీడన- మొత్తంగా దేశ ప్రగతినే దిగలాగుతోంది!
మహిళా సాధికారిత సాధ్యమేనా?
అవతారిక, ప్రాథమిక హక్కులు బాధ్యతలు, ఆదేశిక సూత్రాలన్నింటా లింగసమానత్వాన్ని ప్రబోధించిన భారత రాజ్యాంగం- మహిళల స్థితిగతుల మెరుగుదలకు ప్రత్యేక చొరవ కనబరచే అధికారాన్ని ప్రభుత్వాలకు కట్టబెట్టింది. అయిదో పంచవర్ష ప్రణాళిక (1974-78) నుంచి పంథా మార్చిన ప్రభుత్వాలు స్త్రీ సంక్షేమం స్థానే అభివృద్ధి పథకాలకు పాదుచేస్తూ వచ్చాయి. సమాజంలో మహిళల స్థాయి నిర్ధారణకు సాధికారతనే మౌలిక సూత్రంగా సర్కార్లు రెండు దశాబ్దాలనుంచి పరిగణిస్తున్నాయి. స్త్రీలపై అన్ని రకాల దుర్విచక్షణకు భరతవాక్యం పలకాలన్న 1993నాటి అంతర్జాతీయ ఒడంబడికను ఇండియా ఔదలదాల్చినా, దేశీయంగా 2001లో మహిళా సాధికారతకు జాతీయ విధానాన్నే రూపొందించినా- ప్రవచిత లక్ష్యాలకు దీటుగా ముందడుగు పడనేలేదు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికల్ని కొత్తపుంతలు తొక్కించేందుకు 2016లో జాతీయ విధాన ముసాయిదా వెలుగుచూసినా అదింకా అమలులోకి రానేలేదు. దేశ జనాభాలో సగంగా ఉన్న స్త్రీలు సహజసిద్ధ ప్రతిభావ్యుత్పన్నతలకు సాన పట్టుకొని నిపుణ శ్రామిక శక్తిగా ఎదిగివస్తే వర్ధమాన దేశంగా అంగలారుస్తున్న భారతావని జాతకం కళ్లు జిగేల్మనేలా మారిపోతుందనేది నిర్ద్వంద్వం. ఇండియా లింగ సమానత్వాన్ని సాధించగలిగితే 2025 నాటికి స్థూలదేశీయోత్పత్తికి ఏకంగా 70 వేలకోట్ల డాలర్ల సంపద అదనంగా జమపడుతుందన్న మెకిన్సే అంచనా- మన వెనకబాటుకు మూలకారణాన్ని ఎత్తిచూపుతోంది. ఒంటిరెక్కతో ఏ పక్షీ ఎగరలేనట్లే, జనాభాలో సగంగా ఉన్న స్త్రీశక్తిని సమర్థ మానవ వనరుగా సద్వినియోగం చేసుకోకుండా ఏ జాతీ పురోగమించలేదన్న వాస్తవాన్ని విధానకర్తలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది!
ఇదీ చూడండి: 'సుదీర్ఘ తీర్పు కాదు.. స్పష్టత ముఖ్యం'