మహా ట్విస్ట్: ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి గవర్నర్ పిలుపు
20:54 November 11
మహా ట్విస్ట్: ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి గవర్నర్ పిలుపు
మహారాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనకు ఇచ్చిన గడువు ముగిసిన కాసేపటికే... ఎన్నికల ఫలితాల్లో మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ పార్టీకి సమాచారమిచ్చారు. 24 గంటల గడువును నిర్దేశించారు. రేపు రాత్రి 8.30 గంటల వరకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్సీపీకి సమయముంది.
తొలుత ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా భాజపా (105)ను గవర్నర్ ఆహ్వానించగా.. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని ఆ పార్టీ.. గవర్నర్‌కు తెలియజేసింది. దీంతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేన (56)ను గవర్నర్ ఆహ్వానించారు. సోమవారం రాత్రి 7.30 గంటల్లోగా ప్రభుత్వం ఏర్పాటుకు బలాన్ని, సమ్మతిని తెలియజేయాలని సూచించారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన మరింత గడువు కోరగా.. అందుకు తిరస్కరించారు.
మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీ (54)కి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఇవాళ రాత్రి సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (44), శివసేన సహకారం ఆ పార్టీకి తప్పనిసరి. మరి ఇప్పుడు ఎన్సీపీ ఏంచేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.