రైళ్లలో ప్రయాణికులకు మసాజ్ సౌకర్యం కల్పించాలన్న ప్రతిపాదనపై రైల్వేశాఖ వెనక్కి తగ్గింది. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి ప్రారంభమయ్యే 39 రైళ్లలో ఈ సేవలు అందించాలని ఇటీవలే రైల్వే ప్రతిపాదించింది.
" పశ్చిమ రైల్వే రత్లామ్ డివిజన్ పరిధిలోని ఇండోర్ స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్లలో తల, కాళ్ల మసాజ్ సేవలను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదన పశ్చిమ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిన వెంటనే.. మసాజ్ సౌకర్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు."
- రవీందర్ భకర్, పశ్చిమ రైల్వే ప్రతినిధి
రైళ్లలో మసాజ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఎంపీ శంకర్ లాల్వానీ, లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహజన్ వ్యతిరేకించారు. ఇలాంటి సేవల వల్ల ప్రయాణికులు, ముఖ్యంగా మహిళల భద్రత, సౌకర్యాల అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు.
రైల్వే మంత్రికి లేఖ
ఈ విషయంపై ఈ నెల 10న రైల్వే శాఖ మంత్రికి భాజపా ఎంపీ లాల్వానీ లేఖ రాశారు. రైళ్లలో ప్రయాణికులకు మసాజ్ సౌకర్యాలు కల్పించటం సముచితం కాదని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు ఉన్న సమయంలో అలాంటివి చేయటం సరికాదన్నారు. ప్రయాణికులకు వైద్య సదుపాయాలు, వైద్యులను అందుబాటులో ఉంచటం వంటి సేవలకు బదులు ఇలాంటి విలువ లేని సేవలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:'కరవుపై సమీక్ష-వ్యవసాయంలో నిర్మాణాత్మక సంస్కరణ'