బంగాల్లో శాంతిస్థాపనకు కృషి చేద్దాం: గవర్నర్ త్రిపాఠి సార్వత్రిక ఎన్నికల అనంతరం పశ్చిమబెంగాల్లో జరుగుతున్న హత్యలకు నిరసనగా ఆ రాష్ట్ర భాజపా కోల్‌కతాలో చేపట్టిన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రదర్శనగా వెళ్తున్న భాజపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీనిని భాజపా కార్యకర్తలు ప్రతిఘటించడం వల్ల పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు. బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగింంచారు.
ఈ ఘటనలో భాజపా సీనియర్ నేతలు ముకుల్‌రాయ్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రాజు బెనర్జీ సహా పలువురు గాయపడ్డారు. దీనిపై బంగాల్ రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇన్ఛార్జ్ కైలాస్ విజయవర్గీయ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోస్ రోడ్డుపైన బైఠాయించారు. తరువాత తమ నిరసనను విరమించారు. పోలీసులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎన్సీఎస్సీ పర్యటన..
ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్బలిలో జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ (ఎన్సీఎస్సీ) సభ్యులు శుక్రవారం పర్యటించనున్నారు. గత శనివారం తృణమూల్, భాజపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో షెడ్యూల్ కులాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఐదుగురు సభ్యులు గల ఎన్సీఎస్సీ బృందం ఈ బాధితుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తుందని కమిషన్ పేర్కొంది.
అఖిలపక్ష నేతలతో నేడు గవర్నర్ భేటీ...
రాష్ట్రంలో శాంతి భద్రతల పునరుద్ధరణపై చర్చించేందుకు బంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి గురువారం సాయంత్రం 4 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి తృణమూల్ కాంగ్రెస్, భాజపా, సీపీఎం, కాంగ్రెస్ నేతలను ఆహ్వానించారు.
ఇదీ చూడండి: శాంతి సూచి జాబితాలో భారత్@141