కర్ణాటక బెళగావిలో ఓ జంట తమ పెండ్లిపత్రికను హాల్టికెట్ రూపంలో ముద్రించి.. అందరి దృష్టినీ ఆకట్టుకుంది. జమకండి తాలూకా సిరగుప్పి గ్రామానికి చెందిన బసవరాజ బిరదరా.. అత్తనీ తాలూకా హలాహల్లీకి చెందిన పార్వతీలు తమ వివాహ వేడుకలో విద్యార్థులకు కాస్త ధైర్యం చెప్పేందుకు ఈ వినూత్న ప్రయత్నం చేశారు.
పరీక్షలంటే అనవసరంగా ఆందోళన చెందుతారు విద్యార్థులు. తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. భారత్లో పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అందుకే, వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే స్కూలు, కాలేజీ పరీక్షల పట్ల భయం పోగొట్టాలని నిర్ణయించుకున్నారు బసవరాజ, పార్వతీలు.
తమ వివాహ శుభలేఖను హాల్టికెట్ రూపంలో ముద్రించి బంధుమిత్రులను ఆహ్వానించారు. జీవితంలో అన్ని పరీక్షలనూ ధైర్యంగా ఎదుర్కోవాలని సందేశాన్నిచ్చారు. సామాజిక దృక్పథంతో ముందడుగు వేసిన ఈ జంట.. సోమవారం ఒక్కటయింది.