కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో 39 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు రైతులు. కేంద్రంతో సోమవారం ఏడో విడత చర్చలు జరపనున్నారు. ఈసారి నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందేనని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కాలయాపన చేయకుండా మూడు సాగు చట్టాల రద్దు ప్రక్రియను కేంద్రం ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ కేంద్రం ఎప్పటిలాగే సోమవారం కూడా నిర్ణయం తీసుకోకుంటే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎముకలు కొరికే చలి, వానను తట్టుకుంటా అన్నదాతలు ధైర్యంగా పోరుడుతున్నారని రైతు సంఘాలు నాయకులు తెలిపారు. ఆందోళనల్లో పాల్గొంటూ మృతి చెందిన రైతుల త్యాగాలు వృథా కానివ్వమని స్పష్టం చేశారు. కేంద్రంతో ఏడో విడత చర్చలు సఫలం కాకుంటే జనవరి 13న లోహ్రి పండుగ సందర్భంగా సాగు చట్టాల కాపీలను దహనం చేస్తామన్నారు. జనవరి 23న నేతాజీ జయంతి రోజున కిసాన్ దివస్ నిర్వహిస్తామని చెప్పారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోకి ప్రవేశించి ట్రాక్టర్లతో పరేడ్ చేపడతామని హెచ్చరించారు. కేంద్రం పంతానికి పోకుండా దిగివచ్చి మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు కోరారు. చట్టాలను ఉపసంహరించుకునే వరకు తాము దిల్లీ సరిహద్దు వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.