తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా టీకా అత్యవసర ఆమోదాన్ని పరిశీలిస్తాం' - ICMR LATEST UPDATE

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్​ అనుమతులపై కీలక వ్యాఖ్యలు చేసింది ఐసీఎంఆర్​. దేశీయంగా రూపొందించిన రెండు టీకాలు రెండో దశ ప్రయోగ పరీక్షలు పూర్తి కావచ్చాయని.. ప్రభుత్వం నిర్ణయిస్తే వ్యాక్సిన్​కు అత్యవసరంగా ఆమోదాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. ఈ మేరకు కరోనా వ్యాక్సిన్‌పై పార్లమెంటు స్థాయీ సంఘానికి నివేదించింది ఐసీఎంఆర్‌.

ICMR
'కరోనా టీకా అత్యవసర ఆమోదాన్ని పరిశీలిస్తాం'

By

Published : Aug 20, 2020, 8:03 AM IST

దేశీయంగా రూపొందించిన రెండు కొవిడ్‌ వ్యాక్సిన్ల రెండో దశ ప్రయోగ పరీక్షలు పూర్తికావచ్చాయని... ప్రభుత్వం నిర్ణయించిన పక్షంలో వ్యాక్సిన్‌కు అత్యవసరంగా ఆమోదం తెలిపే అంశాన్ని పరిశీలిస్తామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది. ఈ మేరకు హోం వ్యవహారాల పార్లమెంటు స్థాయీ సంఘానికి ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ నివేదించారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ సభ్యుడు ఆనంద్‌ శర్మ అధ్యక్షతన బుధవారం స్థాయీ సంఘం సమావేశమైంది. దీనికి సంఘం సభ్యులతో పాటు బలరాం భార్గవ తదితర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.

మహమ్మారిని ఎదుర్కోవడంలో ఐసీఎంఆర్‌, వైద్య బృందాలు ఎంతో కృషి చేస్తున్నాయని, దేశంలోని ఆసుపత్రులన్నింటికీ దిల్లీలోని ఎయిమ్స్‌ సమర్థవంతమైన సలహాలిస్తోందని, పార్టీలకు అతీతంగా సభ్యులంతా ప్రశంసించారు. సమావేశంలో 4 గంటలపాటు చర్చించిన అంశాలను పలువురు ఎంపీలు వెల్లడించారు. 'భారత్‌ బయోటెక్‌, క్యాడిలా అభివృధ్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ రెండో దశ క్లినికల్‌ పరీక్షలు త్వరలో పూర్తవబోతున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం-సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన వ్యాక్సిన్‌ రెండో దశ క్లినికల్‌ పరీక్షలు ఈ వారాంతంలో ప్రారంభమవుతాయి' అని భార్గవ చెప్పినట్టు ఓ ఎంపీ వెల్లడించారు.

ప్రజలు ఇంకా ఎంతకాలం ఈ మహమ్మారిని ఎదుర్కోవాల్సి ఉంటుందని సభ్యులు ప్రశ్నించారు. ఇందుకు భార్గవ బదులిస్తూ- 'సాధారణంగా టీకా తుది ప్రయోగ పరీక్షలు పూర్తికావడానికి 6 నుంచి 9 నెలల సమయం పడుతుంది. ప్రభుత్వం నిర్ణయిస్తే... వ్యాక్సిన్‌ను అత్యవసరంగా ఆమోదించే అంశాన్ని పరిశీలించవచ్చు' అని ఆయన పేర్కొన్నారు. వేగవంతమైన కొవిడ్‌ నిర్ధరణ పరీక్షను నిర్వహించేందుకు అమెరికా ఆమోదించిన లాలాజల పరీక్ష విషయాన్ని సభ్యులు ప్రస్తావించగా, ఈ అంశం ఇప్పటికే తమ పరిశీలనలో ఉందని భార్గవ చెప్పారు. కొవిడ్‌ బాధితులను బంధువులు, పొరుగువారు వివక్షతో చూడటం పట్ల సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కొవిడ్‌-19 కారణంగా ప్రజలు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సభ్యులు ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రస్తుతమున్న మార్గదర్శకాలను సమీక్షించేందుకు ఐసీఎంఆర్‌ అంగీకరించింది. పాఠశాల విద్యార్థుల ఆన్‌లైన్‌ తరగతులు, ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల కలిగే శారీరక, మానసిక ఒత్తిళ్లు వంటి అంశాలను సభ్యులు చర్చించారు.

'9% పరిశ్రమలు మూతపడ్డాయి'

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎగుమతుల్లో 50%, జీడీపీలో 30% వాటా ఉందనీ, మహమ్మారి కారణంగా అందులో పనిచేస్తున్న 11 కోట్ల మందిపైనా తీవ్ర ప్రభావం పడిందని ఆనంద్‌ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మొత్తం 6.33 కోట్ల ఎంఎస్‌ఎంఈ యూనిట్లలో 9% మూతపడ్డాయని సంబంధిత శాఖ కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌శర్మ వివరించారు. మహమ్మారిని ఎదుర్కొనే విషయమై... రాబోయే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ స్థాయీ సంఘం నివేదిక సమర్పించనుంది.

ఇదీ చూడండి:కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్​ సూచనలు

ABOUT THE AUTHOR

...view details