ఇది మరో ప్రపంచ యుద్ధం. సరిహద్దుల్లేని యుద్ధ క్షేత్రంలో కంటికి కనిపించని ప్రాణాంతక వైరస్‌పై అకుంఠిత దీక్షతో మానవాళి సాగిస్తున్న మహాపోరాటం! వ్యక్తిగా ప్రతి పౌరుణ్నీ పూర్తి అవగాహన గల నిబద్ధ సైనికుడిలా మార్చి, వ్యష్టిగా వ్యవస్థగా కరోనాను నిలువరించేందుకు, నియంత్రించేందుకు ఇండియా సహా అంతర్జాతీయ సమాజం చేస్తున్నది- వందేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని మహాయజ్ఞం! ప్రపంచ ఆరోగ్య సంస్థ పది రోజుల క్రితం కొవిడ్‌ను మహమ్మారిగా ప్రకటించేనాటికి అది 114 దేశాల్లో లక్షా 18 వేలమందికి సోకి 4,291 మందిని కబళించింది. అదే నేడు 180 దేశాలకు, మూడు లక్షలకు పైగా కేసుల రూపేణా విస్తరించి 13,700 మందిని బలిగొంది! అంతర్జాతీయీకరణ దరిమిలా యావత్ ప్రపంచమే కుగ్రామంగా మారిపోయి విమానయానం ఊహాతీతంగా విస్తరించడంతో పర్యాటకుల రాకపోకలు అత్యధికంగా నమోదైన అయిదు దేశాల్లోనూ కరాళ నృత్యం చేస్తున్న కరోనా- ఇండియా పైనా కోరచాస్తోంది.
భారత్‌లో రెండోదశలోనే..
వుహాన్ నగరంలో తొలి కేసు నమోదైన కొత్తల్లో కరోనా తీవ్రతను సరిగ్గా గుర్తించలేక భారీ మూల్యమే చెల్లించిన చైనా, వైద్యారోగ్య రంగ శ్రేణుల్ని మోహరించి మహా సంగ్రామమే చేసి కరోనాను కట్టడి చెయ్యగలిగింది. బీజింగ్ అనుభవం నుంచి గుణపాఠాలు నేర్చిన దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాలు విస్తృత వ్యాధి నిర్ధారణ పరీక్షలతో కరోనాపై పైచేయి సాధిస్తుండగా, దూరదృష్టి కొరవడిన ఇటలీ ఉప్పెనలా విరుచుకుపడ్డ వైపరీత్యానికి కిందుమీదులవుతోంది. అమెరికా బ్రిటన్లూ తీవ్రాందోళనకర పరిస్థితుల్లో ఉన్నాయన్న ప్రమాద ఘంటికలు మోగుతున్న వేళ- ఇండియాలో కరోనా విస్తృతికి రెండోదశలోనే పగ్గాలేసే బహుళ కార్యాచరణకు రంగం సిద్ధమైంది. అఖిల భారత జనావళి జయప్రదం చేసిన జనతా కర్ఫ్యూను వెన్నంటి, దేశవ్యాప్తంగా 11 వేల ప్యాసింజర్ రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సులూ ఈ నెలాఖరు దాకా రద్దు అయ్యాయి. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాలు సరిహద్దుల్ని మూసేస్తున్నాయి. కరోనా అన్నది ప్రస్తుతానికి ఏ మందూ మాకూ లేని మహమ్మారి. మనిషి నుంచి జనసమూహాలకు ఊహాతీత వేగంతో సంక్రమించే వ్యాధి లక్షణాల పట్ల సమగ్ర అవగాహనతో ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య రంగ నిపుణులు, ప్రజలు, మీడియా ఉమ్మడి పోరాటానికి నడుం కట్టాలి!
శతాబ్దపు మహమ్మారిలా..
వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ అప్పటి 150 కోట్ల ప్రపంచ జనాభాలో నాలుగోవంతుకు సోకి మోగించిన మరణ మృదంగం ఇప్పటికీ చరిత్ర పుటల్లో ప్రతిధ్వనిస్తోంది. దరిమిలా కొన్ని దశాబ్దాలకు‘యాంటీ బయాటిక్స్’ కనుగొనడంతో ‘మాయరోగాల’ ఉరవడికి అడ్డుకట్ట పడినా- 2003నాటి సార్స్, 2013నాటి మిడిల్‌ఈస్ట్ ఫ్లూ వంటివి కొంత భీతిల్లజేశాయి. వాటికి భిన్నంగా ‘శతాబ్దపు మహమ్మారి’లా కరోనా దేశదేశాల సామాజిక ఆర్థిక ఆరోగ్యరంగాల్ని కుదిపేస్తోంది. ప్రపంచానికే సరఫరాదారుగా మారిన చైనాలో పరిశ్రమలు మూతపడటంతో అత్యవసర వైద్య సరఫరాలందక అమెరికా సైతం కలవరపడుతోంది. ఈ స్థాయి ఉత్పాతం ఓ సవాలుగా నిలిచినప్పుడు ఎలా స్పందించాలో 1941లో ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వమే సోదాహరణగా చాటింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో కార్ల తయారీని నిలిపేసిన వాహన పరిశ్రమ ప్రతి గంటకు పదికి పైగా యుద్ధ విమానాల్ని సిద్ధం చేసిన వైనం- ఏకోన్ముఖ పోరాటానికి జాతిని ఆయత్తం చేస్తే విజయం తథ్యమని నిరూపించింది.
వ్యాక్సిన్ తయారీకి కనీసం ఏడాదిన్నర..