తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంపై ఉమ్మడి పోరాటం' - సోనియా గాంధీ వార్తలు

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్వహించిన సమావేశంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నీట్, జేఈఈ నిర్వహణను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. కేంద్రంపై పోరుకు అందరూ ఏకం కావాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు.

opposition-ruled states
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

By

Published : Aug 26, 2020, 7:20 PM IST

జీఎస్టీ పరిహారం, ప్రవేశ పరీక్షల నిర్వహణపై విపక్ష పార్టీల ముఖ్యమంత్రులతో చర్చించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. జీఎస్​టీ బకాయిల చెల్లింపునకు కేంద్రం నిరాకరించటం రాష్ట్రాలతో పాటు దేశ ప్రజలను వంచించటమేనని ధ్వజమెత్తారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు.

మోదీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సోనియా. మహమ్మారి సమయంలో పరీక్షల నిర్వహణను తప్పుబట్టారు. నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలనిబంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించగా.. అందరూ మద్దతు తెలిపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం..

కేంద్ర ప్రభుత్వాన్ని చూసి భయపడాలో, దాంతో తలపడాలో తేల్చుకోవాలని సూచించారు మహా సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. అందరికీ అధికారం ప్రజలే ఇచ్చారనీ.. కానీ, రాష్ట్రాలు ఏదైనా చేస్తే అది పాపం.. కేంద్రం చేస్తే మాత్రం పుణ్యం అన్నట్టుగా పరిస్థితి తయారైందన్నారు.

లాక్‌డౌన్‌ నుంచి తమ రాష్ట్రం ఇప్పుడిప్పుడే బయటపడుతుందన్న ఉద్ధవ్‌.. పాఠశాలలు మాత్రం ఇప్పట్లో తెరవబోమని స్పష్టంచేశారు. అమెరికాలో పాఠశాలలను తెరిస్తే 97వేల మంది చిన్నారులు కరోనా బారినపడ్డారని.. అలాంటి పరిస్థితే ఇక్కడా తలెత్తితే ఏం చేస్తామని ప్రశ్నించారు.

సుప్రీంకు వెళదాం: మమత

నీట్‌, జేఈఈ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు బంగాల్ సీఎం మమత. కరోనాతో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ పరీక్షలు నిర్వహించాలనుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఈ పరీక్షకు ఎలా కూర్చుంటారో అని దీదీ ఆందోళన వ్యక్తంచేశారు.

"సెప్టెంబర్​లో పరీక్షలు ఉన్నాయి. విద్యార్థుల జీవితాలను ఎందుకు ప్రమాదంలో పెట్టాలి? మేం ప్రధానికి రేఖ రాశాం. కానీ ఎలాంటి స్పందన లేదు. ఆయన మన మాట వినకపోతే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళదాం. సహకార సమాఖ్య స్ఫూర్తి పేరుతో రాష్ట్రాలను కేంద్రం తొక్కేస్తుంది." అని మమతా బెనర్జీ మండిపడ్డారు.

దీదీతో ఏకీభవిస్తున్నా..

పరీక్షల వాయిదాపై అందరూ కలిసి ప్రధానిని కలవాలన్న మమత ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నట్టు చెప్పారు పంజాబ్​ సీఎం అమరీందర్ సింగ్. అందరం కలిసి సుప్రీంకోర్టుకు వెళ్దామని, రివ్యూ పిటిషన్‌ వేద్దామని అన్నారు. కరోనాపై తమ ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. తమ రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని, జీఎస్​టీ బకాయిలు రాకపోతే పంజాబ్​లో ఆర్థిక లోటు భారీగా పెరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.

  • రాజస్థాన్​ సీఎం అశోక్ గహ్లోత్: కరోనా సమయంలో కేంద్రం సహకారం లేకపోవటం వల్ల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ విషయాన్ని ప్రధాని లేదా రాష్ట్రపతితో చర్చించేందుకు ప్రతిపక్షాలను సోనియా ఏకం చేయాలి.
  • ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్​: సుప్రీంకోర్టుకు వెళ్లేముందు మరోసారి ప్రధాని లేదా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నా.
  • ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్: 4 నెలలుగా జీఎస్​టీ బకాయిలు చెల్లించటం లేదు. రాష్ట్రాల్లో పరిస్థితి భయంకరంగా ఉంది.
  • పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి: నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహిస్తే కరోనా కేసులు పెరుగుతాయి. విద్యార్థులు ప్రభావితమైతే కేంద్రమే బాధ్యత వహించాలి. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయమిది.

ABOUT THE AUTHOR

...view details