సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో పలు చోట్ల తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై రైతు సంఘాల నాయకులు స్పందించారు. శాంతియుతంగా చేపట్టిన ర్యాలీని.. కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రైతుసంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ ఆరోపించారు. అయితే వారిని అన్నదాతలు గుర్తించారని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా అందులో ఉన్నట్లు స్పష్టం చేశారు.
అక్కడక్కడా జరిగిన అల్లర్లను నేతలు ఖండించారు. ఇలాంటి ఘటనలు ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు. అలాంటి వారితో తాము కలిసి పోరాడాలని అనుకోవడం లేదని వివరించారు.
"సంఘ వ్యతిరేక శక్తులు ర్యాలీలో చొరబడటం వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయి. వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదు. శాంతి మా అతిపెద్ద బలం. కొన్ని సంస్థలు, వ్యక్తులు ఈ మార్గాన్ని ఉల్లంఘించారు. నిబంధనలను పాటించని వారితో మాకు ఎలాంటి సంబంధం లేదు. నిర్ణయించిన మార్గంలో.. పరేడ్ నిబంధనల మేరకు ర్యాలీ జరపాలని నిర్ణయించుకొన్నాం. హింసాత్మక చర్యలకు పాల్పడొద్దని, జాతీయ చిహ్నానికి కళంకం తేవొద్దని ముందస్తుగానే అనుకున్నాం. హింసాత్మక ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం."