తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్టికల్​ 370 రద్దు: కశ్మీరీల భిన్నాభిప్రాయాలు

జమ్ముకశ్మీర్​ను పరిపూర్ణంగా భారత్​లో విలీనం, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల్లో విభిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. జమ్మూ ప్రజలు కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. లద్దాఖ్​ లేహ్​ ప్రాంతంలో మాత్రం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కశ్మీరీల భిన్నాభిప్రాయాలు

By

Published : Aug 6, 2019, 6:32 AM IST

జమ్ముకశ్మీర్​లో అధికరణలు 370, 35-A ను రద్దు చేస్తూ కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్​కు ప్రత్యేక హోదా కల్పించే ఈ రాజ్యాంగ హక్కులను రద్దు చేయడం కారణంగా జమ్ముకశ్మీర్​ ఇప్పుడు భారత్​లో పూర్తిగా విలీనమైంది. అంతేకాకుండా రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న మరో నిర్ణయంతో రాష్ట్ర రూపురేఖలు సమూలంగా మారనున్నాయి. ఈ రెండు బిల్లులకు రాజ్యసభ సోమవారం ఆమోదం తెలిపింది.

దాదాపు 70 ఏళ్ల తర్వాత రాష్ట్ర రూపురేఖలను మార్చే చారిత్రక నిర్ణయంపై జమ్ముకశ్మీర్​ ప్రజలు ఏమనుకుంటున్నారు? తాజా పరిణామాలపై వారి స్పందన ఎలా ఉంది?

'ఆర్టికల్ 370తో మా మనోభావాలు ముడిపడి ఉన్నాయి'

తాజా పరిస్థితులతో రాష్ట్రంలో మరో కొత్త తరహా హింస చెలరేగే అవకాశముందని కశ్మీర్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఆర్టికల్​ 370 రద్దు తమ హక్కులను కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

"ప్రభుత్వ నిర్ణయంతో మేము ఆశ్చర్యానికి గురయ్యాం. ఈ పరిణామం మమ్మల్ని నిరాశకు గురిచేసింది. ఎందుకంటే అధికరణ 370తో మా మనోభావాలు ముడిపడి ఉన్నాయి."

-ఫరూఖ్​ అహ్మద్​ షా, శ్రీనగర్​ నివాసి

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు రాష్ట్ర రాజకీయ పార్టీలే కారణమని ఓ స్థానిక ఉపాధ్యాయురాలు అన్నారు. 'కేంద్రం నిర్ణయంతో మేం మా గుర్తింపును కోల్పోయాం. ఈ చర్యతో రాష్ట్రంలో శాంతి నెలకొనకపోగా.. మరింత హింస చెలరేగే అవకాశం ఉందని' ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం జమ్మూలో మోహరించిన భద్రత దళాలను కేంద్రం ఉపసంహరించుకున్న అనంతరం.. రాష్ట్రం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడుతున్నట్లు మరో స్థానికుడు తెలిపాడు.

ధైర్యంగా మా స్వస్థలాలకు వెళతాం

భద్రతాలేమి కారణంగా.. 1990లో కశ్మీర్​ లోయను వీడిన కశ్మీరీ పండిట్లు.. ఆర్టికల్​ 370 రద్దు పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ స్వస్థలమైన జమ్ముకశ్మీర్​కు ఇకపై ధైర్యంగా వెళతామని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కశ్మీర్​లో మున్ముందు శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయంతో భారత దేశ చరిత్రలో ఆగస్టు 5 తేదీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. మోదీ ప్రభుత్వం.. త్వరలోనే తాము కశ్మీర్​కు తిరిగివెళ్లేందుకు మార్గం సుగమం చేస్తారని ఆశిస్తున్నామన్నారు జమ్ము కశ్మీర్​ విచార్​ మంచ్ కమ్యూనిటీ పండిట్లు.

లేహ్​లో హర్షం.. కార్గిల్​లో నిరసన

జమ్ముకశ్మీర్​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై లేహ్​ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేయగా.. కార్గిల్ ప్రజలు నిరసన తెలిపారు.

బౌద్ధులు ఎక్కువగా ఉండే లేహ్​లో చాలా కాలంగా వారు కోరుకుంటున్న కల నేరవేరినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ముస్లింలు ఎక్కువగా ఉండే కార్గిల్​లో ఆర్టికల్​ 370 రద్దుపై నిరసనలు వెల్లువెత్తాయి.

'లద్దాఖ్​ కేవలం శాంతియుత ప్రాంతమే కాదు. సున్నితమైన సరిహద్దు ప్రాంతం. దీనికి వ్యూహాత్మక ప్రాముఖ్యం ఉందని' లేహ్​ నియోజకవర్గ ఎంపీ (లోక్​సభ) జమ్యాంగ్​​ సెరింగ్ నంగ్యాల్ అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోయేదిగా ఆయన అభివర్ణించారు.

ఇదీ చూడండి: 'ఆర్టికల్​ 370, 35-A రద్దు'.. తర్వాత ఏంటి?

ABOUT THE AUTHOR

...view details