తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇది గోవా కాదు మహారాష్ట్ర'.. భాజపాకు పవార్ వార్నింగ్​ - ఈటీవీ భారత్ వార్తలు

మహారాష్ట్రలో శివసేన-ఎన్​సీపీ-కాంగ్రెస్​లు మహా బల ప్రదర్శన చేపట్టాయి. తమ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలందరినీ ఒకే చోటికి చేర్చి ప్రభుత్వ ఏర్పాటుకు తగిన బలం ఉందని చూపే ప్రయత్నం చేశాయి. మెజారిటీ లేకుండా ఏర్పాటు చేసిన ఫడణవీస్​ ప్రభుత్వం నిలబడదని ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ వ్యాఖ్యానించారు. ఇది గోవా కాదని.. మహారాష్ట్రని భాజపానుద్దేశించి విమర్శలు చేశారు. విడదీయాలని ఎంత ప్రయత్నిస్తే అంతగా ఐక్యంగా ఉంటామని అన్నారు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే.

'ఇది గోవా కాదు మహారాష్ట్ర'.. భాజపాకు పవార్ వార్నింగ్​

By

Published : Nov 25, 2019, 10:48 PM IST

మహారాష్ట్రలో శివసేన కూటమి మహా బల ప్రదర్శన చేపట్టింది. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యా బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశాయి శివసేన, కాంగ్రెస్, ఎన్​సీపీ. ఈ మేరకు వివిధ హోటళ్లలో బస చేసిన మూడు పార్టీల శాసనసభ్యులందరూ ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్​లో సమావేశమయ్యారు. మొత్తం 162 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారని శివసేన నేత సంజయ్​ రౌత్​ వెల్లడించారు. ఈ సమావేశానికి శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే, ఎన్​సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే సహా పలువురు హాజరయ్యారు.

ఇది గోవా కాదు మహారాష్ట్ర

మెజారిటీని నిరూపించుకోవడానికి తమకు ఎలాంటి సమస్య లేదని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి సస్పెండ్​ అయినవారు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేరని అన్నారు. బల పరీక్ష జరిగే రోజు 162 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తామని స్పష్టం చేశారు.

"మేము మహారాష్ట్ర ప్రజలకోసం కలిశాం. రాష్ట్రంలో మెజారిటీ లేకుండానే ప్రభుత్వం ఏర్పాటైంది. కర్ణాటక, గోవా, మణిపుర్​లలో కూడా భాజపాకు మెజారిటీ లేదు. అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇది గోవా కాదు, మహారాష్ట్ర అని తెలుసుకోవాలి. బలం లేని ఫడణవీస్ సర్కారు నిలబడదు. పొత్తుపై నిర్ణయం తీసుకునే అధికారం అజిత్ పవార్​కు లేదు."
- శరద్​ పవార్​, ఎన్​సీపీ అధినేత

సత్యమేవ జయతే

కేవలం అధికారం కోసం తాము పోరాడటం లేదని శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే అన్నారు. సత్యం గెలవడం(సత్యమేవ జయతే) కోసమే పోరాడుతున్నామని తెలిపారు. ఎంతగా విడదీయాలనుకుంటే అంతగా ఐక్యంగా నిలబడతామని స్పష్టం చేశారు. తమ పార్టీలో చీలికలు తెచ్చే ధైర్యం ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు ఠాక్రే.

అనంతరం ఎమ్మెల్యేలందరూ తమ పార్టీలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉంటామని శపథం చేశారు. భాజపాకు అనుకూలంగా ఎలాంటి పనులు చేయమని ప్రతినబూనారు.

తిప్పికొట్టిన భాజపా

మూడు పార్టీలు కలిసి చేపట్టిన బల ప్రదర్శన కేవలం గుర్తింపు కోసమేనని భాజపా ఎద్దేవా చేసింది. భిన్న భావజాలాలున్న కాంగ్రెస్​తో శివసేన చేతులు కలపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు మహారాష్ట్ర మాజీ మంత్రి ఆశిష్ షెలార్​. బల పరీక్షలో తప్పకుండా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. హోటల్​లో జరిపిన సమావేశాల వల్ల బలపరీక్షలలో నెగ్గలేరని, చివరికి రేసులో గెలిచేది మాత్రం భాజపానే అని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details