మాతృభూమి మీద మమకారంతో ప్రాణాలను సైతం లెక్కచేయక సైన్యంలో చేరిన వీరులు వారు. కుటుంబాలకు దూరంగా దేశరక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్నవారు. కన్నభూమిని కంటికి రెప్పలా కాచుకుంటున్నవారిని శత్రుబలగాలు దొంగ దెబ్బ కొట్టాయి. సరిహద్దుల్లో చైనా దళాలతో వీరోచితంగా పోరాడుతూ 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కదిలించే గాథ. వారి కుటుంబాలు పడుతున్న వ్యథ వర్ణనాతీతం. వారి త్యాగాల వెనుక దాగిన గాథలివి.
కుమార్తె పుట్టిన 17 రోజులకే...
ఏడాదిన్నర క్రితమే పెళ్లయింది. 17 రోజుల కిందట పండంటి పాప పుట్టింది. ఆ శుభవార్త విన్న తండ్రి గుండె ఆనందంతో ఉప్పొంగింది. 'లద్దాక్‌లో ఉన్నానమ్మా.. సెలవు దొరకగానే పాపను చూడ్డానికి వస్తాను' అని ఫోన్‌లో మాటిచ్చాడు. కుటుంబంతో అవే అతడి ఆఖరు మాటలు. కానీ కన్నకూతురి ముఖం కూడా చూడకుండానే శత్రు సైనికుల చేతిలో అసువులు బాశాడు ఝార్ఖండ్‌కు చెందిన కుందన్ కుమార్ ఓఝా(20). రైతు కుటుంబంలో పుట్టిన కుందన్ 2011లో సైన్యంలో చేరాడు. అతడికి మొదట్నుంచి సైన్యంలో చేరాలన్న కోరిక ఉండేదని, అందుకోసం తెల్లవారుఝామునే 3 గంటలకు లేచి శారీరక కసరత్తులు చేసేవాడని అతడి సోదరుడు గుర్తుచేసుకున్నాడు.
మాతృభూమి రుణం తీర్చుకున్న గిరిపుత్రులు
ఒడిశాలోని గిరిజన గూడేల్లో పుట్టిన ఇద్దరు గిరిపుత్రులు సైనికులుగా దేశం కోసం సేవలందించే స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచారు. ఇప్పుడు విధి నిర్వహణలో ప్రాణాలర్పించి యావత్‌దేశానికి గర్వకారణంగా నిలిచారు. వారే చంద్రకాంత ప్రదాన్, సోరెన్. బియర్పంగ గ్రామానికి చెందిన చంద్రకాంత (28) ఓ దిగువ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టాడు. 2014లో సైన్యంలో చేరాడు. తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లు, ఒక అక్క ఉన్న కుటుంబానికి అతడి ఉద్యోగమే ఏకైక ఆధారం. ఇంకా పెళ్లి కూడా కాలేదు. కొన్ని రోజుల క్రితమే ఫోన్ చేసి సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు గురించి తల్లిదండ్రులతో పంచుకున్నాడు. కానీ ఇలాంటి విషాదం ఎదురవుతందని వారు ఊహించలేదు. కుమారుడితో పాటు కుటుంబ ఆదరువునూ కోల్పోయారు అతడి తల్లిదండ్రులు. అయినా వారు కుంగిపోవడం లేదు. మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన కుమారుడిని చూసి గర్వపడుతున్నామని చెప్పారు. చంపవుడ గ్రామానికి చెందిన సోరెన్‌ది (43) కూడా ఇలాంటి దీనగాథే. 1997లో సైన్యంలో చేరిన అతడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి ఎప్పుడు సెలవుల్లో ఇంటికి వస్తాడా అని ఆశగా ఎదురుచూసిన ఆ పిల్లలు ఇప్పుడు సోరెన్ భౌతిక కాయం కోసం దిగాలుగా ఎదురుచూస్తున్నారు.