దేశంలో కొవిడ్-19 ఉద్ధృతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా విధించిన లాక్‌డౌన్ నాటి నుంచి ఇళ్లలో ప్రత్యేకంగా పట్టణాలు, నగరాల్లోని ఇళ్లలో నీటి వాడకం పెరిగిపోయింది. ఇళ్లకే పరిమితమైన ప్రజలు పదేపదే చేతులను శుభ్రం చేసుకోవడం, ఇంటిని క్రిమిరహితం చేసుకోవడమే ఇందుకు కారణం. కేంద్ర జల్‌శక్తి శాఖ, జల సంరక్షణ కార్యకర్తలు చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఒక్కసారి చేతులను శుభ్రం చేసుకోవడానికి కనీసం రెండు లీటర్ల నీరు వాడుతున్నట్లు సర్వేలో తేలింది. ''కరోనా నుంచి కాపాడుకునేందుకు ప్రజలు తరచూ కనీసం 20 సెకన్ల నుంచి 30 సెకన్లు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సిఫార్సు చేసింది. ఇందుకు వినియోగించే నీటి పరిమాణం సుమారు 2 లీటర్లు ఉంటోంది. ఒక కుటుంబంలో నలుగురు లేక ఐదుగురు సభ్యులు ఉంటే.. రోజుకు కనీసం 70 లీటర్ల నీటిని అదనంగా వినియోగిస్తున్నారు'' అని జల్‌శక్తి శాఖలోని ఓ అధికారి తెలిపారు.
''నగరాలు, పట్టణాల్లో జన సాంద్రత ఎక్కువగా ఉన్నందున అక్కడ నీటి వినియోగం ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలవారికి కాలువలు, చెరువులు వంటి జలవనరులు ఉంటాయి. నగరవాసులకు మాత్రం కుళాయి, బోరు నీరే ఆధారం. అందువల్ల భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. ఓ వైపు ముంబయిలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయినా.. చాలా ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆగస్ట్ నెలలో కనీసం 20% నీటి సరఫరాను తగ్గించేందుకు బృహణ్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ సిద్ధం అవుతోంది. మరోవైపు, ముంబయిలో కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందువల్ల ఇళ్లలో నీటి వినియోగం పెరగడం అనేది అనివార్యం'' అని వివరించారు.