తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీటి వనరులను కాపాడుకోకుంటే మనుగడ కష్టమే! - water crisis news

జలం... సమస్త ప్రాణకోటికి జీవనాధారం. భూమండలం మీద ఏ జీవి నీరు లేకుండా మనుగడ సాగించలేదు. మనిషి ఆహారం లేకుండా కొద్దిరోజులైనా జీవించగలడు కానీ, నీరు లేకుండా జీవించలేడు. అందువల్ల నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, వృథాను అరికట్టడం, కొత్త వనరులను సృష్టించడంపై పాలకులు, ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

నీటి వనరులను కాపాడుకోకుంటే కడగండ్లే!

By

Published : Nov 11, 2019, 8:50 AM IST

నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, వృథాను అరికట్టడం, కొత్త వనరులను సృష్టించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వాన నీటి సంరక్షణే నేటి కర్తవ్యం. తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వానలు కురిశాయి. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల కృష్ణ, గోదావరి నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. అందుబాటులోకి వచ్చిన ఈ నీటిని భవిష్యత్‌ అవసరాల కోసం సాధ్యమైన మేర భద్రపరచుకోవాలి. ఆ దిశగా సరైన అడుగులు పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

కరవు ప్రాంతాలు పెరిగిపోతున్నాయి..

ప్రపంచవ్యాప్తంగా నీటి వినియోగం 1960 నుంచి అధికమైంది. ఫలితంగా నీటి వనరులు నానాటికీ తరిగిపోతున్నాయి. ప్రపంచంలో నాలుగింట ఒకవంతు జనాభా గల 17 దేశాలు ‘చాలా అధికస్థాయి నీటి ఒత్తిడి’ని ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో వ్యవసాయం, పరిశ్రమలు, నగరాలు సంవత్సరానికి 80 శాతం వరకు నీటిని వినియోగిస్తున్నాయి. మూడింట ఒకవంతు జనాభాగల 44 దేశాలు ఏటా 40 శాతం నీటిని వాడుతూ ‘అధికనీటి ఒత్తిడి’కి గురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నీటి అవసరాలు, సరఫరా మధ్య వ్యత్యాసాల కారణంగా కరవు ప్రాంతాలు పెరిగిపోతున్నాయి. దీని ప్రభావం మానవ జీవితాలు, జీవనోపాధి, వ్యవసాయాభివృద్ధి, ఆహార భద్రత, వ్యాపార స్థిరత్వం మీద పడుతుంది. జనాభా పెరుగుదల, సాంఘిక ఆర్థికాభివృద్ధి, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ మూలంగా నీటి అవసరాలు పెరుగుతూ ఉన్నాయి.

90 శాతం మేర..

భారత్‌లో ప్రస్తుతం పట్టణాల్లో దాదాపు 90 శాతం మేరకు పంపుల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. గ్రామాల్లో 80 శాతంపైగా గృహాలకు ఇలాంటి సౌకర్యం లేదు. ఫలితంగా స్త్రీలు, పిల్లలు కాలినడకన నీటికోసం చాలా దూరం నడిచి వెళ్లాల్సివస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో ఆనకట్టల నిర్మాణాలు, నీటిపారుదల రంగం అభివృద్ధి మీదనే ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాయి. తాగునీటి వనరుల గురించి అంతగా పట్టించుకోలేదు. రానురాను ప్రజల అవసరాలకు అనుగుణంగా నీటి వనరుల వినియోగం, ప్రాధాన్యతను ప్రభుత్వాలు గుర్తించాయి. ఫలితంగా మొదటిసారి నీటిపారుదల కంటే తాగునీటికే ప్రాధాన్యం కల్పించే విధంగా 1987లో ‘నీటి వనరుల చట్టం’ తీసుకువచ్చారు.

దక్షిణాది రాష్ట్రాలు భిన్నం..

కరవు ప్రాంతాల్లో వర్షపు నీటి నిల్వలే ప్రధాన ఆధారం. ఉత్తరాది రాష్ట్రాల్లో భూఉపరితల జలాలు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఇందుకు భిన్నం. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం రాళ్లతో నిండి ఉంటుంది. అందువల్ల వాన నీటిని సంరక్షించడం కష్టమవుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షకాలంలో ఏటా సుమారు 500 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఈ వర్షం ఆధారంగా దాదాపు 10 నుంచి 12 చదరపు మీటర్ల మేరకు నీటిని భూఉపరితలం మీదగాని, భూగర్భపొరల్లోగాని నిల్వ చేయవచ్చు.

ఇటీవల తమిళనాడు, రాజస్థాన్‌ల్లో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమిళనాడులో నీటి సమస్య తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుబాటులో ఉన్న భూఉపరితల జలాలను సక్రమంగా వినియోగించులేకపోవడం వైఫల్యం. పరిశ్రమల వ్యర్థాలు, రసాయనిక ఎరువులు తదితర కాలుష్య కారకాలతో తాగడానికి వీలుకాని విధంగా భూగర్భజలాలు విషతుల్యమయ్యాయి. నాణ్యమైన పంపులు వాడకపోవడం, పంపుల పగుళ్ల ద్వారా వ్యర్థాలు మంచినీటిలో కలవడంతో ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. నీటి కొరత తీవ్రత ఉన్న మరో రాష్ట్రం రాజస్థాన్‌. ఇక్కడ కాలువల ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు అంతంత మాత్రమే.

పదమూడో స్థానంలో..

నీతిఆయోగ్‌ (2018) నివేదిక ప్రకారం నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ పదమూడో స్థానంలో ఉంది. ‘చాలా అధిక స్థాయి నీటి ఒత్తిడి’కి గురవుతున్న 17 దేశాల జనాభా కన్నా భారత్‌ జనాభా మూడు రెట్లు అధికం. కేంద్రీయ భూగర్భబోర్డు (2018) నివేదిక మేరకు సంవత్సరానికి సుమారు ఎనిమిది సెంటీమీటర్ల చొప్పున భూగర్భ జలమట్టాలు తగ్గుతున్నాయి. దీని ప్రభావం దేశ ఆర్థికవ్యవస్థ మీద ఉంటుంది. రానున్న రెండు మూడు దశాబ్దాల కాలంలో నీటి సమస్యపై దృష్టి సారించకపోతే మరిన్ని ఇబ్బందులు అనివార్యం కానున్నాయి. ప్రపంచ వనరుల సంస్థ (2019) నివేదిక మేరకు ‘చాలా అధిక స్థాయిలో నీటి ఒత్తిడి’ని ఎదుర్కొంటూ ఎనిమిదో స్థానంలో ఉన్న సౌదీ అరేబియా ప్రతి వర్షపు నీటిబొట్టును నిల్వ చేయాలని, వచ్చే దశాబ్దకాలంలో నీటి వినియోగాన్ని 43 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘అధిక స్థాయి నీటి ఒత్తిడి’తో 37వ స్థానంలో ఉన్న నమీబియా గత 50 సంవత్సరాల నుంచి మురుగు నీటిని శుభ్రపరచి తాగడానికి వాడుతుంది. ‘మధ్యస్థాయి నీటి ఒత్తిడి’లో 50వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కరవు సమయంలో గృహ అవసరాలకు నీటి వినియోగాన్ని సగానికి తగ్గిస్తుంది. 56వ స్థానంలో ఉన్న చైనా వాన నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను కొత్తగా నిర్మిస్తున్న గృహసముదాయాల్లో అంతర్భాగం చేసింది.

నీటి పొదుపు..

భూఉపరితల జలం ఆవిరిగా మారడం, తిరిగి వర్షరూపంలో భూమిమీదకు చేరడం తప్ప నీటికి పునరుత్పత్తి లేదు. ఉన్న నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మినహా మరొక మార్గం లేదు. అందువల్ల ప్రతి వాన నీటి బొట్టు నిల్వ, వ్యర్థజలాలను శుద్ధి చేసి వాడటం, తక్కువ నీటితో పంటల సాగుపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. నీటి వినియోగంలో పొదుపును ప్రజలు పాటించాలి. మెరుగైన నీటి నిర్వహణ చర్యల ద్వారా సమస్యను కొంతవరకైనా అధిగమించవచ్చు!
- ఆచార్య నందిపాటి సుబ్బారావు (రచయిత-భూగర్భ రంగ నిపుణులు)

ఇదీ చూడండి: ఈ రోగానికి 'సమగ్ర భూ సర్వే'తోనే పరిష్కారం!

ABOUT THE AUTHOR

...view details