నమస్తే ట్రంప్: యమునా నదిలోకి 500 క్యూసెక్కుల నీరు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా ట్రంప్ పర్యటించే ప్రాంతాలను ఆహ్లాదకరంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది.
ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. తొలుత దిల్లీలో.. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లను ఆయన సందర్శిస్తారు.
ఈ నేపథ్యంలో బులంద్‌షహర్‌లోని గంగానహర్ నుంచి యమునా నదిలోకి 500 క్యూసెక్కుల నీటిని వదిలింది ఉత్తర్‌ప్రదేశ్ నీటిపారుదల శాఖ.
ట్రంప్ ఆగ్రా సందర్శనను దృష్టిలో ఉంచుకుని యమునా నది పర్యావరణ పరిస్థితులను మెరుగుపరిచేందుకు నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు. ఈ నీరు ఫిబ్రవరి 20 నాటికి మథురాలోని యమునా నదిలోకి ప్రవేశించి ఫిబ్రవరి 21లోగా ఆగ్రాకు చేరుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 24 వరకు ఓ స్థాయిలో నీటి మట్టం ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ఈ నీటి విడుదలతో యమునా నది నుంచి వచ్చే దుర్వాసన, ఇతర కాలుష్యాన్ని నివారించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:ట్రంప్‌కు సబర్మతీ ఆశ్రమ బహుమతులు!