నీరు తాగకపోతే పిల్లల్లో డీ హెడ్రేషన్ ఏర్పడి సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థులకు తాగడానికి నీటి సీసాలను పాఠశాలకు పంపించినా సరిగ్గా తాగరు. కారణమడిగితే ఖాళీ దొరకలేదంటూ సమాధానం చెబుతుంటారు. ఈ సమస్యకు కేరళ రాష్ట్రం చెరువత్తూరు, వలియరంబు గ్రామ పంచాయతీల పరిధిలోని పాఠశాలల్లో పరిష్కారం కనుగొన్నారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి నీటి బెల్లు కొడుతున్నారు. ఆ సమయంలో విద్యార్థులు నీరు తాగేలా ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తుంటారు.
ఈ కార్యక్రమం ఇటీవల సమాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ స్ఫూర్తిని వివిధ ప్రాంతాల్లోని విద్యాసంస్థలు అందిపుచ్చుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో
విద్యార్థుల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ కేరళ స్ఫూర్తితో ఆంధ్రపదేశ్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉమ్మర్ అరబిక్ పాఠశాలలో 'వాటర్ బెల్' కార్యక్రమం ప్రారంభించారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ హాజరయ్యారు.