"అమ్మా.. నువ్వు ఇంటికి రావట్లేదని నేనే నీ దగ్గరకు వచ్చేశాను. ఇప్పుడు కూడా నాకు నువ్వు దూరంగా ఎందుకున్నావు. ఇంటికి ఎప్పుడొస్తావు. అమ్మా ఒక్క సారి నన్ను ఎత్తుకో.." అని చెప్పకపోయినా కరోనా క్వారంటైన్లో ఉన్న తన తల్లిని.. దూరం నుంచి కలిసిన ఆ మూడేళ్ల చిన్నారి ఏడుపుకు అర్థం అదే!
తల్లడిల్లిన తల్లీబిడ్డలు..
కరోనా మహమ్మారి నుంచి మనల్ని కాపాడేందుకు వారి కుటుంబాన్ని వదిలి సేవలందిస్తున్నారు వైద్య సిబ్బంది. అలాంటి వైద్యరంగంలో నర్స్‌గా విధులు నిర్వహిస్తోంది కర్ణాటక బెళగావి హలగాకు చెందిన సునంద. ఎందరో రోగులకు నిత్యం సేవలందించే సునందకు కరోనా సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి, డ్యూటీ తర్వాత 14 రోజుల పాటు ఓ హోటల్ గదిలో నిర్బంధంలో ఉంచారు వైద్యులు.
సునంద కూతురు ఐశ్వర్య అమ్మను చూడాలని మారాం చేసింది. నాన్న సంతోష్‌తో కలిసి తల్లి ఉన్న హోటల్‌కి వచ్చింది. తల్లిని చూసి పరిగెత్తుకెళ్లి కౌగలించుకోవాలనుకుంది. కానీ, నాన్న బండి దిగనివ్వట్లేదు. 'అమ్మా, అమ్మా..' అంటూ ఏడుస్తూనే ఉంది ఐశ్వర్య.
బిడ్డ ఆవేదన చూసి సునంద తల్లడిల్లిపోయింది. కన్న బిడ్డను తాకలేని దుస్థితిని మూడేళ్ల చిన్నారికి ఎలా వివరించాలో తెలీక కన్నీటి పర్యంతమైంది.