కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఆకస్మత్తుగా వర్షం పడింది. దీనిని అదునుగా తీసుకున్న ఆయన రాజకీయ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వర్షంలో తడిసిన వారికి రాజకీయంలో మంచి భవిష్యత్తు ఉంటుందంటూ ఛలోక్తులు విసిరారు.
ముంబయిలోని విలేపార్లే ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు గడ్కరీ. పైకప్పు లేని వేదికపై ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో వర్షం ప్రారంభమైంది. వెంటనే ఇద్దరు వ్యక్తులు గడ్కరీకి, ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి గొడుగులు పట్టుకున్నారు.
ఈ సందర్భంగా " వర్షంలో తడిచినప్పుడే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని పాత్రికేయులు అంటున్నారు" అని చమత్కరించారు. ఈ మాటలు అక్కడి వారిలో నవ్వులు పూయించాయి. తను వేసిన జోక్‌కు తనే పెద్దగా నవ్వారు గడ్కరీ.
ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో సతార ప్రాంతంలో నిర్వహించిన ప్రచారంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వర్షంలో తడవటాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు గడ్కరీ.