ముంబయిలో 12ఏళ్ల క్రితం జరిగిన మారణహోమాన్ని హిందూ ఉగ్రవాద దాడిగా చూపేందుకు లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థ ప్రయత్నించినట్లు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ రాకేశ్ మరియా.. 'లెట్ మీ సే ఇట్' నౌ పుస్తకంలో వెల్లడించారు. ఈ విషయంపై భాజపా తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేసింది. ఇస్లామిక్ ఉగ్రవాదం చరిత్రలో తొలిసారి ముష్కరులు తమ గుర్తింపును ప్రజలకు తప్పుగా చూపేందుకు ప్రయత్నించారని భాజపా అధికార ప్రతినిధి జీ వీ ఎల్ నరసింహా రావు అన్నారు. హిందూ ఉగ్రవాద అంశం.. కాంగ్రెస్, పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐల సంయుక్త ప్రాజెక్టా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నట్లు అరోపించారు. ముంబయి దాడులు జరిగిన సమయంలోనే.. భారత స్వదేశీ సంస్థలు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకంటే అత్యంత ప్రమాదకరం అని అమెరికా రాయబారులతో రాహుల్ గాంధీ చెప్పారని నరసింహా రావు ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలను గమనిస్తే నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద సంస్థలకు నిధుల చేరవేత, కసబ్ తప్పుడు గుర్తింపు కార్డు వంటి విషయాల్లో భారీ కుట్ర దాగి ఉందనే అనుమానాలు తెలెత్తుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు నరసింహా రావు. కాంగ్రెస్కు ఐఎస్ఐతో సంబంధాలున్నాయా? అనే విషయంపై ఆ పార్టీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.