ఈవీఎంలపై పిటిషన్ కొట్టివేత 50శాతం వీవీప్యాట్ ఈవీఎంల రసీదులు లెక్కించాలన్న విపక్షాల పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నియోజకవర్గానికి 5 వీవీప్యాట్లలోని రసీదులను లెక్కించాలంటూ ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పును మార్చబోమని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 21 విపక్ష పార్టీలు వేసిన సమీక్షా వ్యాజ్యంపై ఈమేరకు నిర్ణయం ప్రకటించింది.
విపక్షాలు వెనక్కి తగ్గినా...
50శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడంపై విపక్షాలు కాస్త వెనక్కు తగ్గాయి. 21 పార్టీల తరఫున వాదించిన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. కనీసం 25 శాతం రసీదులైనా లెక్కించాలని సుప్రీంను కోరారు. కానీ సుప్రీంకోర్టు అంగీకరించలేదు.
"మా మొదటి పిటిషన్‌కు స్పందిస్తూ నియోజకవర్గానికి 5 వీవీప్యాట్ల రసీదులను లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం సంతోషకరం. మా వాదనలకు అంగీకరించి ఈ తీర్పు ఇవ్వడం అంటే మేము విజయ సాధించినట్టే. నియోజకవర్గానికి 5 వీవీప్యాట్లు అంటే అది 2 శాతమే. మేము అడిగేది ఒక్కటే.. తొలుత 50శాతం వీవీప్యాట్లు లెక్కించాలని కోరాం. ఈ ఎన్నికల్లో కనీసం 33శాతం చేయాలని అభ్యర్థించాం. అదీ కుదరకపోతే కనీసం 25శాతం చేయాలని అడిగాం. కానీ మా వినతిని అంగీకరించకపోవడం దురదృష్టకరం."
--- అభిషేక్ సింఘ్వీ, విపక్షాల తరఫు న్యాయవాది.
ఇదీ నేపథ్యం...
గతంలో ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఒక్కో వీవీప్యాట్ ఈవీఎం రసీదులు లెక్కించేవారు. అయితే... ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వ్యక్తంచేస్తూ 21 విపక్ష పార్టీల నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సార్వత్రిక ఎన్నికల్లో లెక్కించాల్సిన వీవీప్యాట్ రసీదుల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో 50 శాతం వీవీప్యాట్ రసీదులను లెక్కించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు.
ఈసీ అభ్యంతరం...
ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక్కో వీవీప్యాట్‌లోని రసీదులను లెక్కిస్తున్నామని, ఇదే సరైన పద్ధతి అని కోర్టుకు తెలిపింది ఈసీ. ప్రతిపక్షాలు కోరిన పద్దతి అనుసరించటం సాధ్యపడదని స్పష్టం చేసింది. ప్రస్తుత విధానాన్ని మార్చడానికి తగిన కారణాలను పిటిషనర్లు చూపలేకపోయారని వివరించింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు... నియోజకవర్గానికి 5 వీవీప్యాట్లలోని రసీదులను లెక్కించాలంటూ ఏప్రిల్ 8న ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు మళ్లీ సుప్రీంను సంప్రదించాయి. రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.విపక్షాల రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. 50శాతం వీవీప్యాట్ రసీదులు లెక్కించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.