హరియాణా శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు ఇవాళ ఒకే విడతలో ఎన్నికలు జరగుతున్నాయి. 1,169 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 105 మంది మహిళలున్నారు. 85 లక్షల మంది మహిళలతో సహా మొత్తం కోటీ 83 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
హరియాణా అసెంబ్లీ పోరు వివరాలు
నియోజకవర్గాలు : 90
అభ్యర్థులు : 1,169
ఓటర్లు : 1,83,00000
పోలింగ్ కేంద్రాలు : 19,578
భద్రతా సిబ్బంది : 75,000
వీవీప్యాట్ యంత్రాలు: 27,611
భారీ భద్రత...
పోలింగ్ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. సుమారు 75 వేల మంది పోలీసులు, 130 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.
నువ్వా-నేనా...
90 శాసనసభ స్థానాలున్న హరియాణాలో భాజపా, కాంగ్రెస్‌తో పాటు ఐఎన్ఎల్డీ, జన్‌నాయక్ జనతా పార్టీ (జేజేపీ), హరియాణా జన్‌హిత్ కాంగ్రెస్ (హెచ్జేసీ), ఆమ్ ఆద్మీ పార్టీ , బహుజన్ సమాజ్ పార్టీ, స్వరాజ్ ఇండియా తదితర చిన్నపార్టీలూ పోటీ పడుతున్నాయి. అయితే ప్రధానంగా భాజపా-కాంగ్రెస్, జేజేపీ మధ్యనే పోరు నడిచే అవకాశం ఉంది. అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని కాషాయ పార్టీ పట్టుదలగా ఉంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేసింది.ప్రముఖుల పోరు...ప్రస్తుత ముఖ్యమంత్రి, భాజపా నేత మనోహర్‌లాల్ ఖట్టర్ కర్నాల్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. మాజీ సీఎం, సీఎల్పీ నేత భూపీందర్ సింగ్ హుడా గర్హీ సంప్లా- కిలోయ్ నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కాంగ్రెస్ నుంచి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, జేజేపీ నుంచి దుష్యంత్ చౌతాలా, ఐఎన్ఎల్డీ నుంచి అభయ్ సింగ్ చౌతాలా తదితర ప్రముఖులు పోటీలో నిలిచారు.హరియాణా శాసనసభ ఎన్నికల సమరంలో భాజపా ముగ్గురు క్రీడాకారులను బరిలోకి దింపింది. దాద్రి నియోజకవర్గం నుంచి రెజ్లర్ బబితా ఫొగాట్, సోనిపట్‌లోని బరోడా నుంచి యోగేశ్వర్ దత్, పెహోవా నుంచి హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్‌ను బరిలో నిలిపింది.