ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. మొదట నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 18 స్థానాల్లో పోలింగ్ మూడు గంటలకే ముగిసింది. మిగతా రెండు స్థానాలైన జంషెడ్‌పుర్ తూర్పు, పశ్చిమలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది.
64.39 శాతం ఓటింగ్ నమోదు..
రెండో విడతలో మొత్తం 20 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం వరకు మొత్తం 64.39 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికార వర్గాలు పేర్కొన్నాయి.
సిసాయ్లో కాల్పులు..
సిసాయ్ నియోజకవర్గంలో భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. సింగ్ భం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్ స్పెక్టర్ ఒకరు గుండెపోటుతో చనిపోయారు. ఘటన జరిగిన పోలింగ్ బూత్ నంబర్ 36లో ఎన్నికలు రద్దు చేశారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినయ్ కుమార్ చౌబే. దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.
పశ్చిమ సింగ్ భం జిల్లా చాయ్‌బాసా నియోజకవర్గ పరిధిలోని జోజోహటు గ్రామంలో నక్సలైట్లు ఓ ఖాళీ బస్సుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు.