మార్చి 30 ఇడ్లీ దినోత్సవం. తమిళనాడు ఆహార కళాకారుల సంఘం ఏటా ఈ రోజున ఏదో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చెన్నైలో చేసిన ప్రయోగం చూపరులను ఆకట్టుకుంటోంది.
భారత్ భేరి: రాజకీయ ఇడ్లీల రుచిచూడండి - డిసెంబర్ 30
తమిళనాడు అనగానే గుర్తొచ్చే వంటకం ఇడ్లీ. దీని సాయంతోనే విభన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ అప్పుడప్పుడూ వార్తల్లో ఉంటారు అక్కడివారు. ఎన్నికల వేళ ఇలాంటి పనిచేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు కొందరు.
ఓటరు చైతన్యానికి ఇడ్లీలను మాధ్యమాలుగా చేసుకున్నారు ఆహార కళాకారులు. 125 కిలోల బియ్యంతో మొత్తం 325 కిలోల మిశ్రమం సిద్ధం చేశారు. ఈవీఎం సహా ఎన్నికలకు సంబంధించిన పరికరాల రూపాలను ఇడ్లీలతో తయారు చేశారు. ఎన్నికల సంఘం గుర్తుతో పాటు వివిధ సందేశాలను వాటిపై లిఖించారు. 'ఓటు అమ్మకోవటానికి కాదు', 'డబ్బులు తీసుకొని ఓటేస్తే తరువాతి తరం నాశనమౌతుంది' అని ఇడ్లీలపై రాశారు. ఇదంతా చేయడానికి 15 మంది 24 గంటలు కష్టపడ్డారు.
ఎన్నికల సంఘం అనుమతి ఆఖరి నిమిషంలో లభించిందని, లేదంటే ఇంకా భారీ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించేవాళ్లమని చెప్పారు ఆహార కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఇనియవాన్.