కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టాలని సోనియా గాంధీకి లేఖరాసిన 23 మంది సీనియర్ నేతల్లో పలువురు ఈ విషయంపై స్పందించారు. తాము అసమ్మతివాదులం కాదని, పార్టీకి పూర్వవైభవం కోరుకునేవారిమంటూ పేర్కొన్నారు. సోనియా గాంధీనే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని భావించినట్లు తెలిపారు. పార్టీ శ్రేయస్సు కోరుతూ దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై ఆందోళనలను పార్టీకి తెలియజేయటమే తమ ఉద్దేశమన్నారు.
'లేఖ ఉద్దేశం అది కాదు'
పార్టీ అధిష్ఠానాన్ని సవాల్ చేయటం తమ లేఖ ఉద్దేశం కాదని, పార్టీని బలోపేతం చేయటానికి చేసిన ప్రయత్నమంటూ రాజ్యసభ సభ్యుడు వివేక్ తన్ఖా స్పష్టం చేశారు.
"మిత్రులారా, మేం అసమ్మతివాదులం కాదు, పార్టీకి పూర్వవైభవం ప్రతిపాదించేవాళ్లం. పార్టీ నాయకత్వాన్ని సవాల్ చేయడం లేఖ ఉద్దేశం కాదు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నం. న్యాయస్థానాలైనా, ప్రజా సంబంధ విషయాలైనా సత్యమే రక్షణ కవచం. చరిత్ర ధైర్యవంతులనే గుర్తిస్తుంది, పిరికివాళ్లను కాదు."
-వివేక్ తన్ఖా, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు
ఆనంద్ శర్మ
తన్ఖా చేసిన ట్వీట్‌పై సీనియర్ నేత ఆనంద్ శర్మ స్పందించారు. తమ మనసులో పార్టీ మేలును కోరుకుంటూ లేఖ రాశామని దేశంలో ప్రస్తుత పరిస్థితులపై ఆందోళనలనతో పాటు రాజ్యాంగ మౌలిక విలువలపై జరుగుతున్న దాడులను పార్టీకి తెలియజేయటమే తమ ఉద్దేశమని శర్మ పేర్కొన్నారు. భాజపాకు పోటీగా గట్టి ప్రతిపక్షం అవసరమని అన్నారు. పార్టీ పునర్వైభవం కోసం నిజాయతీగా చేసే సూచనలను అసమ్మతి అని అనకూడదని ట్వీట్ చేశారు.
మా తాపత్రయం అదే
2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సిద్ధంగా ఉంచాలనే తాపత్రయంతోనే లేఖను రాసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. ప్రస్తుతం సంస్థ కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే స్థితిలో లేదన్న విషయం అంగీకరించిన వాస్తవమేనని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ నాయకత్వం పార్టీకి ఎప్పుడూ అవసరమేనని నొక్కిచెప్పారు. తాను కాంగ్రెస్‌లో చేరి 50 ఏళ్లు అవుతోందని గుర్తు చేశారు.
"త్యాగం, దేశ భక్తికి గాంధీ కుటుంబం ఎల్లప్పుడు ప్రసిద్ధి చెందింది. సోనియా గాంధీ నాయకత్వం పార్టీకి ఎప్పటికీ అవసరమే. పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగేందుకు సోనియా అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీకి సోనియా తల్లిలాంటివారు. జాతీయ రాష్ట్ర స్థాయిలో పార్టీలో సంక్షోభం తలెత్తినప్పుడల్లా అధిష్ఠానం పక్కన నిలబడ్డాను."
-వీరప్ప మొయిలీ