17వ లోక్‌సభ ఎన్నికల్లో చివరి ఘట్టం ఏడోవిడత పోలింగ్ రేపటితో ముగియనుంది. 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాల్లో 918 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు రవిశంకర్‌ప్రసాద్, హర్ సిమ్రత్ కౌర్ బాదల్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, బంగాల్ సీఎం మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు.
నరేంద్రుడి స్థానంలో నామినేషన్ల వివాదం
ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్న స్థానం కావటం వల్ల వారణాసిపై ఆసక్తి సాధారణమే. మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తొలుత ఊహాగానాలు వచ్చాయి. ప్రియాంక అందుకు అనుకూలంగా ప్రకటనలూ చేశారు. చివరకు... ఆమె బరిలో దిగడం లేదని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్ఠానం. అజయ్ రాయ్‌కు వారణాసి టికెట్ ఇచ్చింది. 2014లోనూ మోదీపై పోటీ చేసి, ఓడిపోయారు ఆయన. ఇప్పుడు మరోమారు తలపడుతున్నారు.
దక్షిణాది రాష్ట్రాల రైతుల ఆందోళనలతో వారణాసి పోరు మరింత రక్తి కట్టింది. నామినేషన్ల విషయంలో అనేక వివాదాలు నడిచాయి. 111 మంది రైతులు కాశీలో నామినేషన్‌కు సిద్ధమైనా.. కొన్ని పరిణామాల దృష్ట్యా వెనక్కితగ్గారు. నిజామాబాద్ పసుపు రైతులు మోదీపై పోటీ చేస్తామని కాశీ వెళ్లారు. అయితే వారికి నామపత్రాల దాఖలులో చిక్కులు తప్పలేదు. స్థానికుల మద్దతు లేని కారణంగా ఈసీ తిరస్కరించింది.
మాజీ జవాను, ఎస్పీ బలపరిచిన తేజ్‌బహదూర్ యాదవ్ నామినేషన్ తిరస్కరణ వివాదంగా మారింది. సుప్రీం కోర్టును ఆశ్రయించినా యాదవ్‌కు నిరాశ తప్పలేదు. చివరకు వారణాసి నుంచి 42 మంది పోటీలో ఉన్నారు.
గోరఖ్‌పుర్‌లో సర్వం 'యోగి'నే
గోరఖ్‌పుర్... ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. 1998 నుంచి 2017 వరకు ఇక్కడ ఎంపీగా గెలిచారాయన. సీఎం అయ్యాక యోగి రాజీనామాతో 2018లో ఉపఎన్నికల్లో జరిగాయి. అనూహ్యంగా ఆ స్థానాన్ని ఎస్పీ ఎగరేసుకుపోయింది.
గోరఖ్పుర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భాజపా. భోజ్‌పురి ప్రముఖ నటుడు రవికిషన్ను పోటీకి దింపింది. రవి కిషన్‌ను గెలిపించడాన్ని వ్యక్తిగత బాధ్యతగా తీసుకున్నారు ఆదిత్యనాథ్. ప్రచార పర్వంలో అన్నీ తానై నడిపించారు.