బంగాల్లో భాజపా కార్యకర్తల మరణాలను నిరసిస్తూ ఆ పార్టీ చేపట్టిన 'నవన్నా చలో' యాత్ర హింసాత్మకంగా మారింది. రాజధాని కోల్కతా సహా హావ్డాలోని అనేక ప్రాంతాల్లో పోలీసులు- ఆందోళనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఆయా ప్రాంతాలు యుద్ధ భూములను తలపించాయి. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు... టైర్లకు నిప్పంటించి రోడ్లను దిగ్బంధించారు.
భాజపా యువ మోర్చా ఈ 'నవన్నా చలో' యాత్రకు పిలుపునిచ్చింది. రాష్ట్ర సచివాలయం నవన్నాను ముట్టడించేందుకు భారీ ఎత్తున నిరసనకారులు బయలుదేరారు. ఈ క్రమంలోనే పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు.
పరిస్థితులను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. నిరసనకారులపై విరుచుకుపడ్డారు. ఆందోళనకారులపై బాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘటనలో భాజపా సీనియర్ నేతలతో పాటు అనేకమంది గాయపడ్డారు. మరోవైపు కోల్కతాలో 89మందిని, హవ్డాలో 24మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు పోలీసులు కూడా గాయపడినట్టు బంగాల్ ముఖ్య కార్యదర్శి అలాపన్ బంధోపధ్యాయ్ వెల్లడించారు.
భయానక వాతావరణం...
హావ్డా జిల్లాలో పరిస్థితులు భయానకంగా మారాయి. హావ్డా మైదాన్ నుంచి మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో నిరసన ప్రారంభించారు భాజపా యువ మోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య. ర్యాలీలో రాష్ట్ర అధ్యక్షుడు సౌమిత్ర ఖాన్ కూడా పాల్గొన్నారు. వారిని మల్లిక్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భాజపా కార్యకర్తలు- పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపుచేసే క్రమంలో జల ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు.
అప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేకపోవడం వల్ల ఆర్ఏఎఫ్(ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్) రంగంలోకి దిగింది. లాఠీఛార్జ్ చేసింది. ఈ ఘటనలో అనేకమంది నిరసనకారులు గాయపడ్డారు.
అయితే ఆందోళనకారుల తీరును పోలీసులు తప్పుబట్టారు. తమపై పెట్రోల్ బాంబులతో దాడి చేసినట్టు ఆరోపించారు. ఓ ఆందోళనకారుడి నుంచి లోడ్ చేసి ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.