గడప దాటి కాలు బయటపెట్టలేక బిక్కుబిక్కుమంటున్న జనం.. కాలిపోయిన వాహనాలతో నిండిన వీధులు.. పుస్తకాల బూడిదతో కూడిన బడులు.. ఈశాన్య దిల్లీలో ఇదీ ప్రస్తుత పరిస్థితి! అల్లర్ల తీవ్రతకు అక్కడి జనమంతా అల్లాడిపోతున్నారు. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా.. ఎవరు ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తారోనన్న ఆందోళనతో హడలెత్తిపోతున్నారు. ప్రధానంగా సోమ, మంగళవారాల్లో ఆందోళనకారులు పలు పాఠశాలల్లో విధ్వంసం సృష్టించారు.
"మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఆందోళనకారులు మా పాఠశాల వైపు దూసుకొచ్చారు. కాపలా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఆ గుంపును చూసి బెదిరిపోయాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయాడు. ఆందోళనకారులు లోపలికి ప్రవేశించి డెస్కులు, పుస్తకాలు, రికార్డులన్నింటినీ కాల్చి బూడిద చేశారు. దాదాపు రూ.70 లక్షల ఆస్తి నష్టం చోటుచేసుకుంది. దాడి సమయంలో పిల్లలు పాఠశాలలో లేకపోవడంతో బతికిపోయాం. పిల్లలు అక్కడే ఉండి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాలంటేనే భయమేస్తోంది" అని బ్రిజ్‌పురి ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ ఆవేదన వ్యక్తం చేశారు.
వీధుల్లోకి వెళ్లి నిత్యావసర సరకులు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోడంతో.. ఇంట్లో ఉన్న బ్రెడ్డు, నూడుల్స్‌తోనే రెండు రోజులుగా ఆకలి తీర్చుకుంటున్నామని బ్రిజ్‌పురి ప్రాంతవాసి ఒకరు తెలిపారు. మూడు రోజులుగా తమ ప్రాంతానికి పాల సరఫరా లేదని వాపోయారు.