ఈ విషయంపై ఊరిలో రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. 300 ఏళ్ల క్రితం హోలీరోజే ఓ సాధువు దుసేర్పుర్ గ్రామానికి శాపం పెట్టాడని ఇక్కడ కొంతమంది ప్రజలు విశ్వసిస్తారు. స్నేహీరామ్ అనే సాధువు గ్రామస్థులను ఏదో కోరిక కోరాడని అంటారు. దానికి వారు నిరాకరించడం వల్ల ఆగ్రహానికి గురైన బాబా ఆ రోజే ఆత్మార్పణం చేసుకున్నారన్నది ఓ కథ.
ఈ పండగ నిర్వహించకపోవడానికి మరో కథనమూ ప్రచారంలో ఉంది. హోలీకా రాక్షసి దహనానికి గ్రామస్థులు సర్వం సిద్ధం చేసి ఉంచారు. సమయానికి ముందే కొందరు యువకులు హోలీకా రాక్షసిని దహనం చేయడం ప్రారంభించారట. యువకుల్ని ఆపేందుకు ప్రయత్నించిన స్నేహీరామ్ బాబాతో వారు హాస్యమాడడం కారణంగా అవమాన భారంతో ఆయనా హోలీకా దహనంలోనే ఆత్మార్పణం చేసుకుని చనిపోయారు.
మంటల్లో కాలుతూ ఇకముందు ఎవరూ ఈ గ్రామంలో హోలీని నిర్వహించకూడదని, ఎవరైనా అందుకు సాహసిస్తే వారికి అనర్థాలు జరుగుతాయని శాపం పెట్టారు. ఆ శాపానికి భయపడి హోలీని నిర్వహించేందుకు ఇప్పటివరకు ఎవరూ సాహసించలేదు.