దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పుర్ ఎన్కౌంటర్లో ప్రధాన సూత్రధారి అరెస్టయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రౌడీ షీటర్ వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఈ నెల 3న అర్ధరాత్రి కాన్పుర్‌లో అతడిని పట్టుకునేందుకు వచ్చిన పోలీసు బృందంపై వికాస్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఈ ఎన్కౌంటర్లో 8 మంది పోలీసులు అమరులయ్యారు. అప్పటినుంచి పరారీలో ఉన్నాడు వికాస్. అతని కోసం యూపీ పోలీసు బృందాలు విస్తృతంగా గాలించాయి. ఎట్టకేలకు ఇవాళ ఉదయం చిక్కాడు.
అలా దొరికాడు..
వికాస్.. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయానికి వెళ్తుండగా.. భద్రతా సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన స్థానిక పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం.. తానే వికాస్ దూబేనని, కాన్పుర్ వాసినని అంగీకరించాడు.
వికాస్ అరెస్టును మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ధ్రువీకరించారు. యూపీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
దూబే అరెస్టైన విషయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్లో తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులకు నిందితుడిని అప్పగించనున్నట్లు స్పష్టం చేశారు.