'అమానవీయం, అసమంజసం, కఠినాత్మకం, ఏకపక్షం'...నేరస్థులకు సంకెళ్లు వేసే పద్ధతిపై భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలివి. ఖైదీ అత్యంత ప్రమాదకరంగా ఉండి, వారిని నియంత్రించడానికి వేరే ఇతర మార్గాలు లేనప్పుడే సంకెళ్లు వేయాలని వివిధ సందర్భాల్లో స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు.
సంకెళ్లకే పోలీసుల ఓటు
అయితే పోలీసులు మాత్రం నేరస్థుల చేతికి సంకెళ్లు వేయడానికే మద్దతిస్తున్నారు. భయంకరమైన నేరస్థులు కస్టడీ నుంచి పారిపోకుండా ఉండేందుకు సంకెళ్లు ఉపయోగపడతాయని చెబుతున్నారు.
దుబే ఘటన
ఉత్తర్ప్రదేశ్లో 8 మంది పోలీసులను బలిగొన్న కరుడుగట్టిన నేరస్థుడు వికాస్ దుబే ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈ సంకెళ్ల అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. గురువారం అరెస్టయిన అతడ్ని ఈ ఉదయం కాన్పుర్కు తరలిస్తుండగా కారు బోల్తాపడింది. ప్రమాదంలో గాయపడ్డ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కొని కాల్పులు జరిపాడు దుబే. వెంటనే పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మరణించాడు.
దుబే చేతులకు సంకెళ్లు వేయకపోవడంపై ప్రస్తుతం దుమారం చెలరేగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే పోలీసులు నడుచుకున్నట్లు తెలుస్తుండగా.. అసలు సంకెళ్లు ఎందుకువేయకూడదనే వాదన చర్చనీయాంశంగా మారింది.
కోర్టుల అనుమతి లేకుండా సంకెళ్లు వేయడం చట్టవిరుద్ధమని 1995లోనే అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చేతికి సంకెళ్లు వేసి కనీసం స్వేచ్ఛగా కదలకుండా అడ్డుకోరాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. నేరస్థులు పారిపోకుండా కాపాడేందుకు సంకెళ్లు తప్పనిసరేం కాదని స్పష్టం చేసింది.
'ఇతర మార్గాలున్నాయ్'
ప్రేమ్ శంకర్ శుక్లా వర్సెస్ దిల్లీ ప్రభుత్వం కేసులో సైతం సుప్రీంకోర్టు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. నేరస్థులను పారిపోకుండా ఉంచేందుకు క్రూరంగా, అగౌరవంగా సంకెళ్లతో బంధించడం కన్నా ఇతర మార్గాలు ఉంటాయని పేర్కొంది.
"సంకెళ్లు వేయడం ప్రాథమికంగా అమానవీయం. కాబట్టి అది అసమంజసం, అత్యంత కఠినమైనది, ఏకపక్షమైనది. సరైన విధానం, లక్ష్యం లేకుండా జంతువులకు వేసినట్లు వీటిని ఉపయోగించడం ఆర్టికల్ 21కి విరుద్ధం. ఖైదీని పారిపోకుండా కాపాడటం, వారి వ్యక్తిత్వాన్ని రక్షించడం.. రెండూ కూడా సామరస్యంగా ఉండాలి."