దొంగతనం చేశారంటూ రాజస్థాన్ నాగౌర్ జిల్లా కరాను గ్రామంలో ఇద్దరు ఎస్సీ యువకులపై బైక్ సర్వీస్ సెంటర్ సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేశారు. రబ్బర్ బెల్టులతో చితకబాదారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం వల్ల ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 16న ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం కేసులు పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు కారకులైన ఏడుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ఏడుగురిని నిర్బంధించినట్లు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రాహుల్ స్పందన
రాజస్థాన్‌లో ఎస్సీ యువకులపై జరిగిన ఈ దాడిని భయంకర ఘటనగా అభివర్ణించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
"రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో ఇద్దరు యువకులను కొడుతున్న వీడియో భయంకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే దీనిపై చర్యలు తీసుకోవాలి. నిందితులను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలి."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
అసెంబ్లీకి సెగ
ఈ ఘటనపై రాజస్థాన్‌లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దాడిని ఖండిస్తూ రాజకీయ పక్షాలు అసెంబ్లీలోనే నిరసన చేపట్టాయి. బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా విపక్షాలకు చెందిన కొందరు నాయకులు ప్లకార్డులు చేతబట్టి సభలో నిరసన తెలిపారు. స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేసి.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళన వెలిబుచ్చారు.
ముఖ్యమంత్రి ట్వీట్
దాడిపై సకాలంలోనే చర్యలు తీసుకొని ఏడుగురిని అరెస్టు చేసినట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పష్టం చేశారు.
"నాగౌర్‌లో జరిగిన సంఘటనపై సకాలంలో చర్యలు తీసుకున్నాం. ఏడుగురు నిందితులను అరెస్టు చేశాం. ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదు. నిందితులను చట్టం ప్రకారం శిక్షించి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం."
-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
కాంగ్రెస్‌పై విమర్శలు
దాడిపై భాజపా ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని వ్యాఖ్యానించింది. కేవలం ట్వీట్లు చేయడమే కాంగ్రెస్ నేతల పని అని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేసింది.
మరోవైపు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం కాంగ్రెస్, భాజపాలు వేర్వేరుగా కమిటీలు ఏర్పాటు చేశాయి.