రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తమ బలాన్ని చూపిస్తూ సచిన్ పైలట్ నేతృత్వంలోని కాంగ్రెస్ క్యాంప్ సోమవారం అర్ధరాత్రి ఓ వీడియోను విడుదల చేసింది. అందులో 16 మంది ఎమ్మెల్యేలు ఒకే దగ్గర కూర్చుని ఉన్నారు. వారంతా హరియాణా మనేసర్‌లోని ఓ రిసార్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
సచిన్ పైలట్ మద్దతుదారుల వీడియో విడుదల ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నివాసంలో శాసనసభపక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి 122 మంది ఎమ్మెల్యేల్లో 106 మంది హాజరైనట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ వీడియో విడుదల చేయటం గమనార్హం.
పైలట్ అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో 10 సెకన్ల నిడివిగల వీడియోను సోమవారం అర్ధరాత్రి పోస్ట్ చేశారు. ఈ వీడియోలో 16 మంది ఎమ్మెల్యేలు వృత్తాకారంలో కూర్చుని ఉన్నారు. కానీ, అందులో పైలట్ ఉన్నట్లు కనిపించలేదు. మరో ఆరుగురు ఉన్నప్పటికీ వారు ఎవరనేది తెలియదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేల్లో ఇద్రరాజ్ గుర్జార్, ముకేశ్ భాకర్, హరీశ్ మీనాలు కనిపించారు.
ఈ వీడియోను 'కుటుంబం' అనే క్యాప్షన్‌తో ట్విట్టర్లో పోస్ట్ చేశారు పర్యటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్. దీనికి సమాధానంగా 'కాంగ్రెస్‌లో విధేయత అంటే అశోక్ గహ్లోత్‌కు బానిసత్వం.. అది మాకు ఆమోదయోగ్యం కాదు' అని ట్వీట్ చేశారు ఎమ్మెల్యే ముకేశ్ భాకర్.
ఇదీ చూడండి: సచిన్ 'పవర్ ప్లే': రంగంలోకి రాహుల్, ప్రియాంక!