మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ భాజపాకే పట్టం కట్టాయి. ఈ ఫలితాలు ప్రధాని నరేంద్రమోదీ పాలన, నాయకత్వానికి ప్రజలు ఇచ్చిన బహుమానం అని భాజపా శ్రేణులు పేర్కొన్నాయి. గెలుపు తమదేనని, మహారాష్ట్ర, హరియాణాల్లో ముఖ్యమంత్రులుగా దేవేంద్ర ఫడణవిస్, మనోహర్ లాల్ ఖట్టర్ కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశాయి.
ఎగ్జిట్ పోల్స్‌ను గమనిస్తే మహారాష్ట్ర, హరియాణాల్లో.. కమల దళం విజయకేతనం ఎగురవేయటం ఖాయమని భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు తెలిపారు.
"విపక్షాలపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ఇంకా పాతకాలం నాటి రాజకీయ వ్యూహాలనే వారు అనుసరిస్తున్నారు. ఇప్పటికే అవినీతిలో కూరుకుపోయారు. అభివృద్ధే ధ్యేయంగా సాగుతున్న భాజపా.. మరోసారి విజయకేతనం ఎగరేస్తుంది."
-జీవీఎల్ నరిసింహరావు, భాజపా అధికార ప్రతినిధి
ఊహల్లోనే ఉండనివ్వండి: ఖట్టర్
ఎగ్జిట్ పోల్ ఫలితాలను నమ్మలేమని హరియాణా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా వ్యాఖ్యానించారు. తనకున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం తథ్యమన్నారు. హుడా ప్రకటనపై ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్పందించారు.