కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ మలయాళ దినపత్రిక మాతృభూమి ఎండీ వీరేంద్ర కుమార్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మీడియాలో విశేష కృషి..
పాత్రికేయ రంగంలో వీరేంద్ర కుమార్ విశేష కృషి చేశారని పేర్కొన్నారు వెంకయ్య నాయుడు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నిష్ణాతులైన జర్నలిస్టు, గొప్ప రచయిత అని గుర్తు చేసుకున్నారు వెంకయ్య.
నిరుపేదల గొంతుక..
వీరేంద్ర కుమార్ మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నిరుపేదల గొంతుక వినిపించటంలో ముందుండేవారని గుర్తుచేసుకున్నారు. సమర్థవంతమైన శాసనసభ్యుడు, పార్లమెంటేరియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఆయన కుటుంభ సభ్యులు, బంధువులకు సానుభూతి తెలిపారు.
వీరేంద్ర కుమార్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు సానుభూతి ప్రకటించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
ప్రజాస్వామ్య, లౌకిక ఉద్యమాలకు తీరని లోటు..
రాజ్యసభ సభ్యుడు వీరేంద్ర కుమార్ మృతి ప్రజాస్వామ్య, లౌకిక ఉద్యమాలకు తీరని లోటుగా పేర్కొన్నారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పత్రికా స్వేచ్ఛలో తన రాజీలేని వైఖరితో మీడియా పరిశ్రమకు ఎనలేని సేవ చేశారని పేర్కొన్నారు. మతతత్వం, విభజన రాజకీయాలపై తన చివరి శ్వాస వరకు పోరాడారని తెలిపారు.
గుండె పోటుతో మృతి..
మలయాళం దినపత్రిక మాతృభూమి ఎండీ, పీటీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు ఎంపీ వీరేంద్ర కుమార్ (84) గుండె పోటుతో గురువారం మరణించారు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన రాత్రి 11 గంటల ప్రాంతంలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. వీరేంద్రకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
1987లో కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు వీరేంద్ర. అనంతరం రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2018 మార్చిలో కేరళలోని ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఎన్నికలు నిర్వహించగా లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. మూడు సార్లు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్‌గా సేవలందించారు వీరేంద్ర.