మన్రేగా రూపశిల్పి, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా.. పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బిహార్ రాజకీయాల్లో తీరని లోటుగా మోదీ అభివర్ణించారు.
రఘువంశ్‌కు నివాళులర్పించిన వెంకయ్యనాయుడు.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్ఎన్ఆర్ఈజీఎస్)ను అమలు చేయడంలో ఆయన పాత్ర చిరకాలం నిలిచిపోతుందని కొనియాడారు.
'రఘువంశ్ ఆకస్మిక మరణం తీవ్ర విచారం కలిగించింది. అట్టడుగు స్థాయి నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎదిగిన గొప్ప నేత ఆయన. పేద, గ్రామీణ ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది.'
- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి సచివాలయం ట్వీట్ అమిత్ షా..
రఘువంశ్ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పేద, అణగారిన వర్గాల ప్రజలకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ తీవ్ర దిగ్భ్రాంతి..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలు.. కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్‌కు ఘన నివాళులర్పించారు. ఆయన మరణంతో బలమైన గళాన్ని వినిపించే గొప్ప నాయకుడ్ని రైతులు కోల్పోయారన్నారు రాహుల్. రఘువంశ్ మరణం దేశ రాజకీయాల్లో తీరని లోటని పేర్కొన్న ప్రియాంక.. ఆయన కృషి ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు.
'బిహార్‌కు ప్రియ కుమారుడు రఘువంశ్' అని కాంగ్రెస్ పేర్కొంది. రాజకీయాల్లో ఆయన నైతిక విలువలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కాంగ్రెస్ వెల్లడించింది.
ఇదీ చదవండి:కేంద్ర మాజీమంత్రి రఘువంశ్ ప్రసాద్ కన్నుమూత