తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రామమందిర భూమిపూజ వేళ దేశవ్యాప్త వేడుకలు నిర్వహించాలి' - అయోధ్య

అయోధ్య రామమందిర నిర్మాణానికి వచ్చే నెల 5న శంకుస్థాపన జరగనుంది. ఆరోజు దేశవ్యాప్తంగా పండగలా చేసుకోవాలని వీహెచ్​పీ పిలుపునిచ్చింది. దేశంలో కరోనా వైరస్​ విస్తరిస్తున్న తరుణంలో.. ఎక్కడివారక్కడే ఉండి నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించింది.

VHP on construction of Ram temple in Ayodhya
'రామమందిర శంకుస్థాపనను అందరు పండగలా చేసుకోవాలి'

By

Published : Jul 26, 2020, 7:02 AM IST

అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగే ఆగస్ట్‌ 5న దేశవ్యాప్తంగా వేడుకలు చేసుకోవాలని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) పిలుపు ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రోజున ఉదయం 10.30 గంటలకు ఆలయ నిర్మాణం కోసం చేపట్టే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 'వందల సంవత్సరాల కల నెరవేరుతున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రామభక్తులు అందరూ ఘనంగా ఉత్సవాలు చేసుకోవాలి' అని వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి మిలింద్‌ పరాండే అన్నారు. 'ఆగస్ట్‌ 5న ఉదయం 10.30 గంటలకు దేశంలోని ప్రముఖ సాధువులు అందరూ తమ పీఠాలు, ఆశ్రమాల్లో, దేశవిదేశాల్లోని భక్తులు తమ ఇళ్లలో లేదా సమీప ఆలయాల్లో రామచంద్ర ప్రభువుని పూజించాలి. కీర్తనలు పాడాలి. పుష్పాలు, హారతులు సమర్పించాలి' అని ఆయన కోరారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అందరూ అయోధ్యకు రావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని, అందువల్ల ప్రజలు తమతమ ప్రాంతాల్లోనే కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు చేసుకోవాలని మిలింద్‌ పరాండే సూచించారు.

ఏర్పాట్లను పరిశీలించిన ఆదిత్యనాథ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శనివారం అయోధ్యను సందర్శించారు. ఆలయ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన ఆయన.. రామ జన్మభూమిలో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమంతుడి ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకున్నారు. అయోధ్యలోని అన్ని ఆలయాల్లో ఆగస్ట్‌ 4, 5 తేదీల్లో దీపావళి పండగ తరహాలో దీపాలు వెలిగించాలని కోరారు. సరయూ తీరంలోనూ దీపాలు వెలిగించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

మహాకాళేశ్వర్‌ ఆలయం నుంచి మట్టి, భస్మం

రామాలయ శంకుస్థాపన కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయం నుంచి మట్టి, భస్మం పంపించనున్నారు. ఝార్ఖండ్‌లోని సువర్ణరేఖ, ఖర్‌కాయ్‌ నదుల సంగమం నుంచి నీరు, మట్టి తీసుకెళ్లనున్నారు.

గయ ధామ్‌ నుంచి వెండి ఇటుక

బిహార్‌లోని గయా ధామ్‌ నుంచి రామాలయ శంకుస్థాపనకు 1.250 కేజీల వెండి ఇటుకను అయోధ్య పంపించనున్నట్లు వీహెచ్‌పీ గయ అర్చక్‌ పురోహిత్‌ ప్రేమ్‌నాథ్‌ తెలిపారు. ఇప్పటికే ఫల్గు నది నీరు, ఇసుకను పంపినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details