1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూలగొట్టారు. అక్కడ యధాతథ స్థితిని కొనసాగించాలన్న కోర్టు ఆదేశాలను కాపాడతామని హామీ ఇచ్చి, దానికి విరుద్ధంగా ప్రవర్తించారు. 'మసీదును కూలగొట్టి ఇస్లామిక్ నిర్మాణాన్ని తుడిచిపెట్టడం దారుణమైన చట్టఉల్లంఘన’ అని సుప్రీంకోర్టు శనివారం తనతీర్పులో వ్యాఖ్యానించింది. దాంతో ప్రస్తుతం అందరి దృష్టి లఖ్‌నవూ సీబీఐ కోర్టులో 27 ఏళ్లుగా కొనసాగుతున్న కేసుపైకి మళ్లింది. ఈకేసు నిందితుల్లో 49 మంది ఇప్పటికే కన్నుమూశారు.
- 1992 డిసెంబర్ 6న మసీదును కూల్చేసిన వెంటనే సాయంత్రం 5.15 గంటలకు గుర్తుతెలియని కరసేవకులపై 197/92 నంబరుతో మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మరో 10 నిమిషాల తర్వాత 198/92 నంబరుతో రెండో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అందులో ఎల్‌కే అడ్వాణీ, అశోక్‌సింఘాల్, గిరిరాజ్ కిశోర్, మురళీమనోహర్‌జోషీ, ఉమాభారతి, వినయ్‌కటియార్, విష్ణుహరి దాల్మియా, సాద్వీ రితంభరపై కేసు పెట్టారు.
- తర్వాత కాలంలో అన్ని కేసులనూ సీబీఐకి కట్టబెట్టింది. దర్యాప్తు అనంతరం 40 మందిపై 1993 అక్టోబరు 5న లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. 1996 జనవరి 11న మరో తొమ్మిది మందిపై అభియోగాలు మోపిన నేపథ్యంలో నిందితుల సంఖ్య 49కి చేరింది.
- నేరపూరిత కుట్రతోనే కూల్చినట్లు 1997 సెప్టెంబరులో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ల ప్రముఖులపై అభియోగాలను నమోదు చేశారు.
- విద్వేష పూరిత ప్రసంగాలపై 48 కేసుల్లో అభియోగాల నమోదుకు అనుమతిస్తూనే, అడ్వాణీ, మురళీమనోహర్‌జోషీ, ఉమాభారతి, వినయ్‌కటియార్, ఇతరులకు మినహాయింపు ఇచ్చింది. ఈపరిణామంతో 21 మందిపై గతంలో తామిచ్చిన ఆదేశాలను 2001 మే 4న సీబీఐ లఖ్‌నవూ కోర్టు ఉపసంహరించుకుంది.
- సీబీఐ 2003 జనవరి 27న రాయబరేలీ కోర్టును ఆశ్రయించి ప్రముఖులపై నమోదైన కేసు విచారణ కొనసాగించాలని కోరింది.
- 2003 సెప్టెంబరు 19న రాయబరేలీ ప్రత్యేక మేజిస్ట్రేట్ విద్వేష పూరిత ప్రసంగం కేసు నుంచి నాటి ఉపప్రధాని అడ్వాణీకి విముక్తి కల్పించారు. మిగిలిన వారిపై అభియోగాల నమోదుకు అనుమతిచ్చారు.
- అడ్వాణీకి విముక్తి కల్పించడంపై పలువురు సవాలు చేయగా... హైకోర్టు ఆదేశంతో 2005 జులై 26న నిందితులందరిపై తిరిగి అభియోగాలు నమోదయ్యాయి.
- 49 మందిపై వేర్వేరు చోట్ల విచారణ సాగడంపై 2011లో సుప్రీంను సీబీఐ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో 2017 ఏప్రిల్ 19న అన్ని కేసులను లఖ్‌నవూ సీబీఐ కోర్టుకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది సుప్రీం. అడ్వాణీతోపాటు మిగిలిన 20 మందిపైనా అభియోగాలు నమోదు చేయాలంది.