దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు సంబంధించిన పలు చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రైతులను నిలువరించే క్రమంలో ఓ రైతుపై పోలీసు లాఠీ లేపిన ఫొటో ఒకటి పలువురి దృష్టిని ఆకర్షించింది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆ సంఘటన తనని తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
"బాధాకరమైన చిత్రం: జై జవాన్.. జై కిసాన్ అన్నది మన నినాదం. కానీ.. ఈరోజు ప్రధాని మోదీ అహంకారం వల్ల రైతులకు జవాన్లు వ్యతిరేకంగా నిలబడాల్సి వస్తోంది. ఇది చాలా ప్రమాదకరం."
- రాహుల్ ట్వీట్
రైతుల ఆందోళనలకు సంబంధించిన పలు చిత్రాలను షేర్ చేసిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బడా కార్పొరేట్లకు ఎర్రతివాచీలతో స్వాగతం పలికే మోదీ సర్కార్.. రైతులు వస్తే మాత్రం రోడ్లపై గోతులు తవ్వుతున్నారని విమర్శించారు.