కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంటుందని 'బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్' సీఈఓ మార్క్ సుజ్మన్ అన్నారు. దేశానికి ఉన్న బలమైన ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఇది సాధ్యమవుతుందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు సుజ్మన్.
"భారత్.. ప్రస్తుత పరిస్థితుల్లో తనకున్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కొవిడ్‌కు వ్యాక్సిన్ వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీకా తయారీ అధిక భాగం మన దేశంలోనే ఉత్పత్తయ్యే అవకాశముంది. ప్రైవైటు రంగాలతో ఉండే భాగస్వామ్యంతో ఇది సాధ్యమవుతంది. అనంతరం.. కరోనా తదుపరి దశలపై దృష్టి సారించాల్సిన అవసరముంది."
- మార్క్ సుజ్మన్, బిల్ అండ్ మిలింద్ గేట్స్ ఫౌండేషన్ సీఈఓ
కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రపంచ దేశాలకు పంపిణీ చేసే విధానంపై కూడా మాట్లాడారు సుజ్మన్. అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా సంపన్న దేశాలలాగే ఒకే విధంగా టీకాను సరఫరా చేయాలని.. వైరస్ వ్యాప్తి తరుణంలో ఇది అత్యంత కీలకమని ఆయన అన్నారు. అయితే.. ఈ ప్రక్రియ ప్రపంచ దేశాల సిఫార్సులు, జాతీయ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
'సీఈపీఐ'తో కలిసి..
కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ పరిశోధనల్లో తమ కంపెనీ కూడా బహుళ స్థాయిలో కృషి చేస్తోందని సుజ్మన్ తెలిపారు. వ్యాక్సిన్ల పెట్టుబడుల్లో కీలక భాగస్వామి అయిన 'కొలిషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్(సీఈపీఐ)'తో కలిసి పని చేస్తున్నామని స్పష్టం చేసారు. అంతేకాకుండా.. కొవాక్స్‌కు కూడా దృఢమైన మద్దతుదారులుగా ఉన్నామని చెప్పుకొచ్చారు సుజ్మన్. ఈ మేరకు 'ది గ్లోబల్ అలియాన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యూనిజేషన్స్(గావి)' ద్వారా భారత్ సహా.. ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి:దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు